రేవంత్ మీద కోపంతో దారుణమైన నిర్ణయం తీసుకున్న ఉత్తమ్

Saturday, September 21st, 2019, 12:01:29 PM IST

నిన్న కాక మొన్న కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డికి వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఇచ్చారు. అప్పుడే కాంగ్రెస్ సీనియర్ నేతలకి ఒళ్ళుమండిపోయింది. ఆ తర్వాత పీసీసీ చీఫ్ పదవి కూడా రేవంత్ రెడ్డికి ఇవ్వబోతున్నారని ప్రచారం మొదలైంది. దీనితో పుండు మీద కారం చల్లినట్లు అయ్యింది తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల పరిస్థితి. ఎలాగైనా సరే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రాకూడదని ఉత్తమ్, కోమటిరెడ్డి, వీహెచ్, భట్టి విక్రమార్క మొదలైన నేతలు ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరిపి హుజార్ నగర్ ఎన్నికలు అయ్యేదాకా మార్చకండి అంటూ మాట్లాడుకొని వచ్చారు.

ఆ తర్వాత రేవంత్ రెడ్డికి చెప్పకుండా హుజార్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ తన భార్యని ప్రకటించాడు. దీనిపై రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉత్తమ్ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. దీనితో కాంగ్రెస్ సీనియర్ నేతలకి మండిపోయింది.దీనితో వాళ్ళు రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు తీవ్ర స్థాయిలో చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ లోని కొందరు నేతలు రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా మీడియాతో అలాగే టీవీ చానెల్స్ చేసే డిబేట్ లో మాట్లాడుతున్నారు.

దీనితో ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోపం పెరిగిపోయింది. రేవంత్ రెడ్డి అంటేనే ఇంతెత్తున ఎగిరిపడుతున్నాడు ఈ మాజీ మిలటరీ అధికారి. ఆయనకున్న అధికారులు ఉపయోగించి ఎవరు కూడా అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడకూడదని, ఎలాంటి డిబేట్స్ కి వెళ్లకుందంటూ ఉత్తమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మిగిలిన సమయంలో ఇలాంటి నిర్ణయం పెద్ద విషయమేమి కాదు, కానీ హుజార్ నగర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వాయిస్ గట్టిగా వినిపించాలి, అందుకు మీడియా మరియు వాళ్ళు నిర్వహించే డిబేట్స్ చాలా అవసరం, కానీ రేవంత్ రెడ్డి మీద ఉన్న కోపంతోనే ఉత్తమ్ కుమార్ ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దీనిపై కాంగ్రెస్ నేతలు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు.