టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్‌రావు ఆరేళ్ల పాటు పదవిలో ఉండి ప్రజలకు పని చేయలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో మాట్లాడిన ఉత్తమ్ చిన్న ప్రైవేట్ కాలేజీ యజమాని అయిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌కు చెంచాగిరీ చేస్తూ ఈ ఆరేళ్లలో ప్రైవేట్ యూనివర్సిటీ స్థాయికి ఎదిగి వందల కోట్లు సంపాదించాడని ఆరోపించారు.
ఇకపోతే బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు ఏనాడూ ప్రజల పక్షాన పోరాడిన చరిత్ర లేదని, ఇక ఆ పార్టీ తరపున వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానానికి పోటీ చేస్తున్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎవరో కూడా ఓటర్లకు తెలియదని ఉత్తమ్ అన్నారు. కాంగ్రెస్ తరఫున హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేస్తున్న ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి మరియు వరంగల్, ఖమ్మం, నల్గొండ నుంచి పోటీ చేస్తున్న రాములు నాయక్‌ను గెలిపించి టీఆర్‌ఎ్‌సకు బుద్ధి చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.