ఉత్తమ్ ఔట్.. కొమటిరెడ్డి ఇన్.. ఇప్పుడిదే హాట్ టాపిక్ !

Thursday, June 6th, 2019, 06:34:22 PM IST

వరుస ఎన్నికలు, ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అంతర్మథనంలో పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాలకే పరిమితమై, పార్లమెంట్ ఎన్నికల్లో కొంచెం వృద్దితో 3 సీట్లను గెలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అస్సలు ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్ స్థానిక ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ మిశ్రమ ఫలితాలతో జనంలో తమ ప్రాభవం ఎలా ఉందో కాంగ్రెస్ పెద్దలు సైతం అంచనా వేయలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ పదవి నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకుంటారని, ఆ స్థానంలోకి భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తారని జోరుగా ప్రచారం నడుస్తోంది. జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారడం కోసమే ఉత్తమ్ పదవి నుండి తప్పుకోనున్నారని చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత గందరగళం నెలకొంది.

ఈ వార్తలపై స్పందించిన ఉత్తమ్, వెంకటరెడ్డి ఇద్దరూ అవి అవాస్తవమని చెబుతున్నా లోపల మాత్రం అదే చర్చ నడుస్తోందని, ఎప్పుడైనా సంచలన నిర్ణయాలు వెలువడవచ్చని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.