సొంత పార్టీనే స్మాష్ చేస్తున్న హనుమంతరావు

Wednesday, June 12th, 2019, 03:16:34 PM IST

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు దూకుడుతనం అందరికీ తెలిసిందే. మునుపు అధికారంలో, పదవుల్లో ఉన్నప్పుడు ఈ దూకుడును ప్రత్యర్థుల మీద మాత్రమే చూపించిన విహెచ్ ఇప్పుడు అవేవీ లేకపోవడంతో సొంత పార్టీ నేతల మీదే చూపుతున్నారు. తెరాసతో చావో రేవో తేల్చుకోవాలనే పరిస్థితిలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ విహెచ్ తీరుతో మరింత ఇబ్బందుల్లో పడుతోంది.

పార్టీ చర్యల్ని తప్పుబట్టడం, సొంత పార్టీ నేతలనే మీడియా ముందు విమర్శించడం ఎక్కువగా చేస్తున్నారు విహెచ్. తాజాగా శాసనసభా పక్షం విలీనంపై దీక్షకు దిగిన భట్టి విక్రమార్కను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఎన్నికల్లో ఓటమిని కప్పిపుచ్చుకోవడానికే ఈ దీక్షలని అన్నారు. అంటే ఆయన ఉద్దేశ్యంలో భట్టి దీక్ష ఒక డ్రామా అని అర్థం కాబోలు. అంతేకాదు రాహుల్ సైతం తెలంగాణలో పార్టీ పరిస్థితిని పట్టించుకోవట్లేదని విమర్శించారు. విహెచ్ లాంటి సీనియర్లే ఇలా పార్టీని, ముఖ్య నేతల్ని తప్పుబట్టడం మూలాన ప్రజల్లో చులకన అవుతామని, ఇది పార్టీ పునాదుల్నే కదిలిస్తుందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.