తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగైపోతుంది.. సోనియాకు వీహెచ్ లేఖ..!

Wednesday, June 9th, 2021, 09:02:50 PM IST


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందని ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. నేడు మీడియాతో మాట్లాడిన వీహెచ్ పార్టీలో అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కొత్త కమిటీ ఎంపిక చేయాలని, సీనియర్ల అభిప్రాయం లేకుండా కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వొద్దని ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. రాష్ట్రంలో పార్టీ వైఫల్యాలపై అధిష్టానం దృష్టి పెట్టాలని సూచించారు.

అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస ఎన్నికల్లో పార్టీ ఓడిపోతున్నా కనీసం ఓటమికి గల కారణాలపై రివ్యూలు కూడా జరపడం లేదని వీహెచ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలు దూరం అవుతున్నారని, టీఆర్ఎస్‌లో ఈటల వంటి బీసీ నాయకుడు పోతే మరో బీసీ అయిన టీడీపీ నేత ఎల్.రమణను పార్టీలోకి తీసుకుంటున్నారని, బీసీల విలువను టీఆర్ఎస్ పార్టీ గుర్తించిందని వీహెచ్ చెప్పుకొచ్చారు. పార్టీలో సమస్యలు చర్చించకుండా కొత్త కమిటీ ప్రకటించడం సరికాదని సూచించారు. గత లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వీహెచ్ అభిప్రాయపడ్డారు. ఇకపోతే కొంతమంది తనను తిట్టినా, బెదిరింపులకు పాల్పడినా కూడా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవట్లేదని ఆరోపించారు.