సంచ‌ల‌న నిజాల‌తో శ్రీ‌దేవి ఫ్యాన్సుకు వ‌ర్మ‌ ప్రేమ‌లేఖ‌ !

Tuesday, February 27th, 2018, 06:06:31 PM IST

ఓవైపు శ్రీ‌దేవి పార్ధీవ దేహాన్ని ముంబైకి చేర్చేందుకు రంగం సిద్ధ‌మైంది. అయితే అంత‌కు స‌రిగ్గా కొన్ని గంటల ముందే రామ్ గోపాల్ వ‌ర్మ ఫేస్‌బుక్‌లో రాసుకున్న ప్రేమ‌లేఖ ఎన్నో సంచ‌ల‌న విష‌యాల్ని వెల్లడించింది. అసలు శ్రీ‌దేవి జీవితంలో ఏం జ‌రిగింది? త‌ను బ‌తికి ఉన్న‌న్నాళ్లు ఎలా జీవించింది? అనే కోణాన్ని ఆర్జీవీ లీక్ చేశారు. బ‌య‌టికి న‌వ్వును పులుముకున్నా, వాస్త‌వికంగా త‌న జీవిత‌మంతా విషాద‌మే నిండి ఉంద‌న్న కొత్త కోణాన్ని తెలియ‌జేశారు.

శ్రీ‌దేవి జీవితం ఆద్యంతం విషాద‌మ‌య‌మే. తండ్రి చ‌నిపోవ‌డం.. ఆస్తుల్ని కోల్పోవడం.. బంధువులే త‌న‌ని మోసం చేయ‌డం.. చేతిలో చిల్లి గ‌వ్వ‌లేని దారుణ‌మైన ప‌రిస్థితికి వెళ్లిపోవడం.. చివ‌రికి సొంత సిస్ట‌ర్ త‌న‌పై పోలీస్ కేసులు భ‌నాయించ‌డం.. ఆ క్ర‌మంలోనే శ్రీ‌దేవి తీవ్రమైన ఒత్తిడితో జీవితాన్ని సాగించ‌డం.. కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో నిర్మాత బోనీక‌పూర్‌ను రెండో పెళ్లి చేసుకోవ‌డంపైనా వ‌ర్మ వివ‌రణాత్మ‌కంగా లేఖ రాశారు. ఇందులో బోని కుటుంబీకుల‌తో శ్రీదేవికి ఉన్న గొడ‌వ‌ల్ని ప్ర‌స్థావించారు. “మై ల‌వ్ లెట‌ర్ టు శ్రీ‌దేవి ఫ్యాన్స్‌“ టైటిల్‌తో వ‌ర్మ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఈ ప్రేమ‌లేఖ శ్రీ‌దేవి జీవితంలో కొత్త కోణాన్ని గొప్ప న‌గ్న‌స‌త్యాల్ని ఆవిష్క‌రించింది. అస‌లు అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి బ‌తికి ఉన్నంత కాలం ఏనాడూ సంతోషంగా లేర‌ని, త‌న‌కు న‌చ్చిన‌ట్టు జీవించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని వ‌ర్మ తెలిపారు. ప్ర‌తి విష‌యంలోనూ త‌న‌కు ఎవ‌రో ఒక‌రు సాయం కావాల్సి వ‌చ్చేద‌ని, వారిపై డిపెండ్ అవ్వ‌డం వ‌ల్ల జీవితంలో ఎంతో కోల్పోయింద‌ని వ‌ర్మ లేఖ‌లో వెల్ల‌డించారు. శ్రీ‌దేవి జీవితాంతం భ‌యంతోనే బ‌తికార‌ని తెలిపారు. త‌న జీవితంలో ఆరంభ‌మే త‌ల్లి రాజేశ్వ‌రి చేసిన త‌ప్పుల వ‌ల్ల ఆస్తుల్ని కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని, ఆ క్ర‌మంలోనే అనారోగ్యంతో అమెరికాలోని ఓ ఆస్ప‌త్రిలో చేరిన త‌న త‌ల్లి మెద‌డుకి అమెరికా వైద్యులు త‌ప్పుడు ఆప‌రేష‌న్ చేయ‌డం వ‌ల్ల మ‌తిస్థిమితం లేని ప‌రిస్థితికి వెళ్లింద‌ని తెలిపారు. ఆ క్ర‌మంలోనే ఆస్తులు శ్రీ‌దేవికి బ‌ద‌లాయించ‌డంలో సిస్ట‌ర్‌తో గొడ‌వ‌లు త‌లెత్తాయి. మ‌తిస్థిమితం లేని త‌ల్లితో సంత‌కం తీసుకుని త‌న‌ని మోసం చేసింద‌ని సోద‌రి శ్రీ‌ల‌త శ్రీ‌దేవిపై కోర్టుకెక్క‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మైంది. నాటి రోజుల్లో త‌న త‌ల్లిదండ్రులు చేసిన త‌ప్పున‌కు శ్రీ‌దేవి ఎంతో వేద‌న అనుభ‌వించింద‌ని వ‌ర్మ లేఖ వెల్ల‌డించింది. శ్రీ‌దేవి మ‌న‌స్త‌త్వం చిన్న పిల్ల‌ల మ‌న‌స్త‌త్వం. ఒక‌రు చెప్పింది విన‌డం త‌ప్ప త‌న‌కు తానుగా ఏదీ చేయ‌లేదు. శ్రీ‌దేవికి తెలిసింది కెమెరా ముందు గొప్ప‌గా న‌టించ‌డం ఒక్క‌టే. తాను ఆనందంగా గ‌డిపిన‌ జీవితంకేవ‌లం కెమెరా ఆన్ అయ్యి క‌ట్ అయ్యేంత‌వ‌ర‌కేన‌ని వ‌ర్మ లేఖ‌లో పేర్కొన్నారు. ఆ త‌ర్వాత‌ కెమెరా ఆఫ్ అయ్యి రియ‌ల్‌ లైఫ్‌లోకి వ‌చ్చాక అంతా రాజీకొచ్చి జీవించ‌డ‌మేన‌ని ఆర్జీవి వెల్ల‌డించారు. బోనీక‌పూర్‌ని పెళ్లాడిన శ్రీ‌దేవి ఆ కుటుంబం నుంచి ఎన్నో ఎదుర్కొన్నార‌ని లేఖ‌లో వెల్ల‌డించారు. ఒకానొక ద‌శ‌లో అప్పుల్లో ఉన్న శ్రీ‌దేవిని ఆదుకునేందుకు అప్ప‌టికే అప్పుల్లో ఉన్న బోనిక‌పూర్ ఓదార్పు ఎంతో సాయ‌ప‌డింద‌ని తెలిపారు. కెమెరా ముందు ఎలా న‌టిస్తూ బ‌తికిందో, అదే తీరుగా కెమెరా వెన‌క కూడా అతిలోక సుంద‌రి న‌టిస్తూ బ‌త‌కాల్సొచ్చింద‌ని త‌న‌తో రెండు సినిమాల‌కు ప‌ని చేసిన వాడిగా అన్ని విష‌యాలు తెలుసున‌ని లేఖ‌లో ప్ర‌స్థావించారు.