వర్మ ఒక నీచుడు, నికృష్టుడు : అల్లు అరవింద్

Thursday, April 19th, 2018, 10:25:29 PM IST

కాస్టింగ్ కౌచ్ విషయమై ఇప్పటికే శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మల వివాదం, జనసేన అధినేత పవన్ కు ముడిపెట్టడం, ఆయనను శ్రీరెడ్డి అసభ్యపదజాలంతో తిట్టడం జరిగింది. అయితే ఇదంతా తాను వర్మ చెపితే చేశానని ఆమె ఒక క్యారక్టర్ ఆర్టిస్ట్ తో జరిపిన ఫోన్ సంభాషణలో తెలిపింది. కాగా నిన్న రాత్రి ఈ విషయమై వర్మ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, పవన్ ను తానే అలా అనుమన్నానని, శ్రీరెడ్డి విషయంలో తనదే తప్పని, అందుకే పవన్ ఫాన్స్ ని క్షమాపణ కోరుతున్నా అన్నారు. అయితే అప్పటినుండి పవన్ ఫాన్స్ ఆయన పై గుర్రుగా వున్నారు. ఈ విషయమై నేడు రాంగోపాల్ వర్మ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సినీ నిర్మాత అల్లు అరవింద్. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు తనను బాధించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫిలిం చాంబర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను మెగా ఫ్యామిలీకి పెద్దగా ఇన్ని రోజులు సహనంగా ఉన్నానని, కానీ కొన్ని సంఘటనలు చూశాక ప్రెస్‌మీట్ పెట్టానన్నారు.

శ్రీరెడ్డి ఆరోపణలపై సినీ పరిశ్రమ సానుకూల దృక్పథంతో ఉందన్నారు. ఇండస్ట్రీ మంచిపని చేయబోతోంది. రిడ్రెస్సల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కమిటీలో 50 శాతం ఇండస్ట్రీ వ్యక్తులతో పాటు మహిళలు, ఎన్‌జీవోలు ఉంటారు. తప్పు చేసిన నిర్మాత, దర్శకులు ఎవరైనా ఉన్నారని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మేము ఇక్కడ మూడు తరాలుగా ఇండస్ట్రీనే నమ్ముకున్నాం. కానీ కొందరు అనవసరంగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. నేను రాంగోపాల్ వర్మను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను. వర్మ ఓ నీచుడు, నికృష్టుడు అని చెబుతున్నా. సినీ పరిశ్రమలో పుట్టి పెరిగిన వర్మ, ఇప్పుడు తల్లిలాంటి ఇండస్ట్రీకి ద్రోహం చేస్తున్నాడు. శ్రీరెడ్డితో పవన్ కల్యాన్‌ను తిట్టించింది తానేనని వర్మ స్వయంగా ఒప్పుకున్నాడు. శ్రీరెడ్డి విషయం బయటకు చెబుతుందని తెలిసే, తన వెదవ తెలివితేటలు చూపిస్తూ వర్మ హడావుడిగా వీడియో రిలీజ్ చేశాడు. వర్మ నీ బతుక్కి ఇదంతా అవసరమా అని ఆయన ప్రశ్నించారు. నీకు పవన్‌పై ఉన్న కోపాన్ని శ్రీరెడ్డితో తీర్చుకోవాలి అనుకున్నావంటూ అల్లు అరవింద్ మండిపడ్డారు.

రాంగోపాల్‌వర్మ ఆర్థిక పరిస్థితికి తమకు తెలుసని, వర్మ వెనుక ఎవరు ఉన్నారో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నీ తల్లినో, అక్కనో తిట్టిస్తే బాధ ఎలా ఉంటుందో తెలుసా’ అని వర్మను ప్రశ్నించారు. వర్మ, నీ బతుక్కి ఇంత యాగీ అవసరమా అని మండిపడ్డారు. పవన్‌కల్యాణ్‌ను తిట్టిస్తే నీకు డబ్బులు ఇస్తామన్నది ఎవరు. నీ సామర్థ్యం నాకు తెలుసు. నీకు అంత స్థాయి లేదు. ఇవన్నీ చూసి రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఒక మనిషి ఎదుగుతుంటే ఎలా దెబ్బతీయాలనే కుట్ర ఇది. పవన్‌కల్యాణ్‌ మీద నీకు ఉన్న కసిని శ్రీరెడ్డితో ద్వారా తీర్చుకుంటున్నావు. నీ తల్లిని నాలుగు బూతులు తిట్టిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది. కానీ, మేం అలాంటి నీచమైన పని చేయం. సురేష్‌ ఫ్యామిలీ ఏమవుతుందోనని ఆందోళనతో మాట్లాడి డబ్బులు ఆఫర్‌ చేశా అని చెబుతున్నావు. చిరంజీవి కుటుంబం అంటే నీకు పడదు గనుక, సురేష్‌ కుటుంబాన్ని కాపాడుతానంటూ ఇంత నాటకమాడతావా. ఇదంతా నీకు అవసరమా.

తల్లి పాలు తాగి రొమ్ము కొరకాలని నీకు ఎందుకు అనిపించింది.ఇండస్ట్రీలో అందరూ సిగ్గుపడుతున్న దాంట్లో నీ పాత్ర ఉంది. ఇలాంటి నీచుడ్ని ఏం చేస్తారో ఇండస్ట్రీ పెద్దలకే వదిలేస్తున్నా. హత్య కేసులో పొడిచిన వారికంటే హత్యకు ప్రణాళిక పన్నిన వారికే ఎక్కువ శిక్ష పడుతుంది. ప్రస్తుత కేసులో శ్రీరెడ్డి కంటే ఆమె వెనుక ఉండి మాట్లాడిస్తున్న వారిపైనే ఎక్కువ చర్యలు ఉంటాయి. అలానే ఆమెను ఆ విధంగా ఉసి కొల్పిన నువ్వు , నీ బ్రతుకు ఈ స్థాయికి దిగజారినందుకు సిగ్గుపడాలి అని మండిపడ్డారు…..

  •  
  •  
  •  
  •  

Comments