200 కోట్ల‌తో ప‌రిశ్ర‌మ‌ను నిల‌బెట్టిన సినిమా.. సీజ‌న్ సెన్సేష‌న్‌: 200 కోట్ల క్ల‌బ్‌లో జుడ్వా -2

Monday, October 16th, 2017, 05:39:05 PM IST

క‌వ‌ల సోద‌రుల కామ‌న్ హాబిట్స్.. అందులోంచి పుట్టే కామెడీ, సెంటిమెంటు, ల‌వ్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన హ‌లోబ్ర‌ద‌ర్ తెలుగునాట మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే. నాగార్జున ద్విపాత్రాభిన‌యం చేసిన ఈ సినిమాని హిందీలో స‌ల్మాన్ ఖాన్ హీరోగా డేవిడ్ ధావ‌న్ రీమేక్ చేశారు. జుడ్వా టైటిల్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం అక్క‌డా బ్లాక్‌బ‌స్ట‌ర్‌.

చాలా కాలం త‌ర్వాత అదే డేవిడ్ ధావ‌న్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో త‌న‌యుడు వ‌రుణ్ ధావ‌న్ ద్విపాత్ర‌ల‌తో `జుడ్వా 2` తెర‌కెక్కించి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టారు. జుడ్వా 2 ఇప్ప‌టికే 50 కోట్ల క్ల‌బ్‌, 100 కోట్ల క్ల‌బ్‌, 150 కోట్ల క్ల‌బ్ దాటుకుని 200 కోట్ల క్ల‌బ్‌లో ప్ర‌వేశించింది. ఈ సీజ‌న్‌కే బెస్ట్ హిట్‌గా నిలిచింది. అక్ష‌య్ కుమార్ `టాయ్‌లెట్ -ఏక్ ప్రేమ‌క‌థ‌`, అజ‌య్‌దేవ‌గ‌న్ `బాద్‌షాహూ` త‌ర్వాత ధావ‌న్ `జుడ్వా2` బెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ మూడు సినిమాల్లో జుడ్వా 2 టాప్ క‌లెక్ష‌న్ల‌తో నంబ‌ర్ 1గా నిలిచింది. ఇప్ప‌టికీ ఈ సినిమాకి స్ట‌డీగా క‌లెక్ష‌న్స్ ద‌క్కుతున్నాయ‌ని ట్రేడ్ రిపోర్ట్ చెబుతోంది. షారూక్‌, స‌ల్మాన్ వంటి దిగ్గ‌జాలు న‌టించిన సినిమాలు డిజాస్ట‌ర్ ఫ‌లితం అందుకుని ప‌రిశ్ర‌మ‌ను నీరసంలో ప‌డేస్తే కుర్ర‌హీరో న‌టించిన సినిమా అసాధార‌ణ వ‌సూళ్లు సాధించి ప‌రిశ్ర‌మ‌ని నిల‌బెట్ట‌డం ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో చ‌ర్చ‌కొచ్చింది. వ‌రుణ్ ధావ‌న్ కెరీర్‌కి ఈ సినిమా ఓ మేలిమ‌లుపు అని చెప్పొచ్చు.