స్పేస్ మూవీ : ‘ఘాజీ’ ద‌ర్శ‌కుడితో మెగాహీరో ప్ర‌యోగం?

Saturday, January 20th, 2018, 10:00:54 PM IST

తెలుగు సినిమా ద‌శ‌-దిశ మారుతోంది. `బాహుబ‌లి`, `ఘాజీ` చిత్రాల‌తో తొలి అడుగు పడింది. ఇక మ‌లి అడుగులో ఏకంగా స్పేస్ బేస్డ్ సినిమాల‌కే ఆస్కారం క‌నిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఇండియాలో ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఏకైక జోన‌ర్ ఇదే. ముఖ్యంగా మ‌న తెలుగులో య‌ముడు, య‌మ‌లోకం అంటూ దేవుళ్ల సినిమాల్లో ఆకాశం చూపించారే కానీ, ఏనాడూ అంత‌రిక్షం.. అందులో ప్ర‌యోగాల్ని చూపించ‌లేదు. ఇక య‌ముడు – దేవుడు పాత ట్రెండ్‌. స్పేస్‌- సైంటిస్టులు-గ్రావిటీ నేటి ట్రెండ్ అనే తీరుగా వ‌రుస‌గా ప్ర‌యోగాల‌కు తెర‌లేచింది సౌత్‌లో. ఇప్ప‌టికే త‌మిళంలో ఓ రెండు స్పేస్ సినిమాలు తీసేస్తున్నారు. జ‌యం ర‌వి హీరోగా శ‌క్తి సౌంద‌ర‌రాజ‌న్ తెర‌కెక్కిస్తున్న `టిక్ టిక్ టిక్‌` స్పేస్‌, ఉల్కాపాతంకి సంబంధించిన సైన్స్ ఫిక్ష‌న్ సినిమా. ఇటీవ‌లే త‌మిళ్‌, తెలుగు ట్రైల‌ర్లు రిలీజై జ‌నం ఐబాల్స్ గిర‌గిరా తిప్పేశాయి. ఈ సినిమాల‌తోనూ బాక్సాఫీస్ వ‌ద్ద‌ మిరాకిల్స్ సాధ్యమేన‌ని కాన్ఫిడెన్స్‌నిచ్చింది ఈ ట్రైల‌ర్‌. ఇక త‌మిళంలోనే మాధ‌వ‌న్ హీరోగా ఓ స్పేస్ బేస్డ్ సినిమా తెర‌కెక్క‌నుంది. బాలీవుడ్‌లోనూ స్పేస్ సైంటిస్ట్‌ రాకేశ్ శ‌ర్మ జీవిత క‌థ ఆధారంగా ఓ సినిమా తెర‌కెక్క‌నుంది.

ఇక‌పోతే తెలుగులో ఈ సినిమాల‌కు ధీటుగా మ‌రో స్పేస్ బేస్డ్ సినిమా ప్రారంభించేందుకు స‌న్నాహాలు సాగుతున్నాయి. ఇప్ప‌టికే గ్రౌండ్ వ‌ర్క్ సాగుతోంది. ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రంలో మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నాడు. ఘాజి వంటి విల‌క్ష‌ణ చిత్రంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు పొందిన సంక‌ల్ప్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని తెలుస్తోంది. సంక‌ల్ప్ వినిపించిన క‌థకు వ‌రుణ్ ఓకే చెప్పాడుట‌. స్పేస్‌కి సంబంధించిన ట్రైనింగ్ కోసం ప్రిప‌రేష‌న్ మొద‌లెట్ట‌బోతున్నాడుట‌. అయితే ఇలాంటి సినిమాకి భారీగా పెట్టుబ‌డులు అవ‌స‌రం అనుకుంటే త‌ప్పేన‌ని సంక‌ల్ప్ నిరూపించ‌బోతున్నాడుట‌. ఇత‌రులు వంద‌ల కోట్ల బ‌డ్జెట్లు పెడుతుంటే సంక‌ల్ప్ మాత్రం కేవ‌లం రూ.26 కోట్ల బ‌డ్జెట్లో ఈ సినిమాని పూర్తి చేస్తాన‌ని ప్రామిస్ చేశాడుట‌. ఇక‌పోతే ఇదివ‌ర‌కూ `ఘాజీ` చిత్రాన్ని ప‌రిమిత బ‌డ్జెట్ లో తెర‌కెక్కించ‌డంలో స‌క్సెసైన సంక‌ల్ప్ రెడ్డిపై న‌మ్మ‌కంతో నిర్మాత‌లు ఓకే చెప్పారుట‌. బావుందండోయ్‌.. ఇది మంచి ప‌రిణామం. మునుముందు అల్లు అర‌వింద్ 500 కోట్ల `రామాయ‌ణం` సెట్స్‌కెళితే వ‌రుణ్‌తేజ్‌కి అందులోనూ ఛాన్స్ గ్యారెంటీ.