సినిమా వాళ్ల‌ని ఓ రేంజులో ఏస్కున్న వెంక‌య్య‌!

Tuesday, December 27th, 2016, 03:37:56 PM IST

venkainaidu
“నాకు సినిమావాళ్లు తెలుసు… వాళ్ల సంగతి కూడా తెలుసు… “! అంటూ ఒకే ఒక్క వాక్యంతో సినీప‌రిశ్ర‌మ‌పై త‌న ఒపీనియ‌న్‌ని క్లియ‌ర్‌క‌ట్‌గా చెప్పారు కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు.

నేటి సినిమాల గురించి పెద్ద‌గా తెలియ‌ద‌ని, ప‌ట్టించుకోన‌ని అన్న ఆయ‌న‌.. అస‌లు ఈ రోజుల్లో కొన్ని సినిమాలు చూస్తుంటే జుగుప్స పుట్టేస్తోంద‌ని అన్నారు. సినిమా అంటే స‌మాజానికి ద‌శాదిశా నిర్ధేశ‌నం చేసేదిగా ఉండాలి. మంచిని కోరాలి.. లేదా ఒక చ‌రిత్ర‌ను అయినా చెప్పాలి. అలాంటివేవీ నేటి సినిమాల్లో లేవు. అంతా క‌మ‌ర్షియ‌ల్ మ‌యం.. అంటూ చీవాట్లు వేశారు. అయితే గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి లాంటి సినిమాలు తెలుగువారి గొప్ప‌త‌నాన్ని ఆవిష్క‌రించే అరుదైన చ‌రిత్ర‌. అమ‌రావ‌తి గొప్ప‌త‌నాన్ని ఆవిష్క‌రించే గొప్ప చ‌రిత్ర సినిమాలో చూపిస్తున్నారు. ఆ సినిమా తీస్తున్న బాల‌య్య గొప్ప‌వాడు.. అంటూ పొగిడేశారు.

కాస్త లోతైన ప‌రిజ్ఞానంతో ఆలోచిస్తే.. వెంక‌య్య మాట‌లు కొంద‌రిని ఉద్ధేశించ‌న‌వి అని కూడా అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడున్న స్టార్ హీరోలంతా కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ హంగులున్న సినిమాల్లో న‌టిస్తూ భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌న్న అర్థాన్ని వెంక‌య్య వ్యంగ్యంగా త‌న మాట‌ల్లో వ్య‌క్త‌ప‌రిచారు. అయితే వెంక‌య్య‌నాయుడు ఇటీవ‌లి కాలంలో మ‌న స్టార్ హీరోల ఆలోచ‌న‌లో వ‌చ్చిన మార్పుల్ని ప‌రిశీలిస్తున్న‌ట్టు లేరు. నిన్న‌గాక మొన్న వ‌చ్చిన `ధృవ‌` సినిమా చూసినా.. అంత‌కుముందు వ‌చ్చిన `జ‌న‌తా గ్యారేజ్‌` లాంటి సినిమాలు చూసినా వెంక‌య్య‌కు ఓ విష‌యం అర్థ‌మై ఉండేది. అస‌లు సంఘంలో చీడ‌పురుగుల్లా త‌యారైన రాజ‌కీయ‌నాయ‌కుల వ‌ల్ల‌నే ఈ భ్ర‌ష్టుప‌ట్టిన సినిమాలు వ‌స్తున్నాయి. అస‌లు ప్ర‌జాసేవికులుగా ఉండాల్సిన వీళ్లు డ‌బ్బు దోచుకుంటూ, న‌ల్ల డ‌బ్బు పోగేసుకుంటూ ద‌గుల్బాజీ ప‌నులు చేయ‌డం వ‌ల్ల‌నే ఇలా వ్య‌వ‌స్థ చ‌వ‌క‌బారుగా మారిపోతోంది. ఆ చ‌వ‌క‌బారు త‌నాన్నే సినిమాల్లో చూడాల్సొస్తోంది. ఒక బిజినెస్‌మేన్ మొత్తం రాజ‌కీయ‌వ్య‌వ‌స్థ‌ని, పోలీసుల్ని త‌న గుప్పిట్లో పెట్టుకుని స‌మాజాన్ని దోచుకునేందుకు ఎత్తుగ‌డ వేస్తాడు. ఇదంతా లోపాయికారీ రాజ‌కీయాల వ‌ల్ల‌నే వీలుప‌డుతుంది. రిల‌య‌న్స్ అంబానీలు ప్ర‌స్తుతం మోదీని గుప్పిట ప‌ట్టి చేస్తున్న‌ది అదే. అంత‌కంటే ముందే కాంగ్రెస్సోళ్ల‌ను వాళ్లు గుప్పిట‌ప‌ట్టారు. అందుకే వారి ఆట‌లు సాగాయి. దేశ‌ప్ర‌జ‌ల సొమ్ముల‌న్నీ వాళ్ల అకౌంట్లోకి వెళ్లిపోతున్నాయి. తాజాగా జియో పేరుతో దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల గుట్టు మొత్తం వేలిముద్రలు, ఆధార్‌ల రూపంలో రిల‌య‌న్స్ చేతిలోకి వెళ్లిపోయాం. అది కూడా ఆ త‌ర‌హా దందానే.

జ‌న‌తా గ్యారేజ్ లాంటి సినిమాలో అస‌లు చేవ‌చ‌చ్చిన పోలీసులు, రాజ‌కీయ‌నేత‌లు ఉన్నారు కాబ‌ట్టే గ్యారేజ్ పెట్టుకోవాల్సొచ్చింద‌ని మోహ‌న్‌లాల్- ఎన్టీఆర్‌ అండ్ గ్యాంగ్ సూటిగా రాజ‌కీయ‌వ్య‌వ‌స్థ‌పై వేలెత్తి చూపించాల్సొచ్చింది. ఈ సినిమాల వ‌ల్ల‌నే ప్ర‌జ‌లు కాస్త‌యినా నిజాలేంటో గ్ర‌హించ‌గ‌లుగుతున్నారు. ఈ సినిమావాళ్ల గొప్ప అభిన‌యం వ‌ల్ల‌నే కొంత‌యినా జ‌నం ఎడ్యుకేట్ అవుతున్నారు. లేదంటే అస‌లు లోపం ఎక్క‌డుందో కూడా తెలీనీకుండా ఈ రాజ‌కీయనాయ‌కులు దోపిడీని సాగిస్తారు.

అంతెందుకు త‌మ స్వార్థ‌ప్ర‌యోజ‌నాల కోసం ఏపీకి ప్ర‌త్యేక‌హోదా వ‌చ్చే అవ‌కాశం ఉన్నా.. వెంక‌య్య‌నాయుడు-చంద్ర‌బాబు- మోదీ త్ర‌యం ఏం చేసింది? ప‌్యాకేజీ పేరుతో మోసం చేయ‌లేదూ? అల‌విమాలిన ప‌థ‌కాలతో ఏపీని భ్ర‌ష్టుప‌ట్టించ‌డం లేదూ? మ‌రి ఇప్పుడు తిట్టాల్సింది సినిమావాళ్ల‌నా? రాజ‌కీయ‌నాయ‌కుల‌నా? మీరే చెప్పండి వెంక‌య్య‌గారూ..!

  •  
  •  
  •  
  •  

Comments