వేణుమాధవ్ సంచలన వ్యాఖ్యలు !

Tuesday, February 6th, 2018, 09:41:13 AM IST

ఎన్నో చిత్రాల్లో నటించి తన పాత్రలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ని కలిసేందుకు నిన్నవెళ్లారు. అయితే, పవన్ అదే సమయంలో ఇంటికి వెళ్లడంతో వేణుమాధవ్ కొంత నిరాశ చెందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖంగా వున్నానని, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కనుక ఆదేశిస్తే, ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రతి సంవత్సరం పవన్ కల్యాణ్ కు కొత్త పంట బియ్యం ఇచ్చి, ఆయన తోటలో కాసిన మామిడి పండ్లను తీసుకెళ్లడం తనకు అలవాటని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజా సమస్యలపై పవన్ కల్యాణ్ దృష్టి పెట్టడం మంచి పరిణామం అని అన్నాడు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, జనసేన పార్టీకి తన పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఇదివరకు నంద్యాలకు జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ తరపున వేణుమాధవ్ ప్రచారం చేసిన సంగతి విదితమే….