గొడ‌వ‌ల్లో `బిచ్చ‌గాడు` కంపెనీ?

Tuesday, April 17th, 2018, 07:53:45 PM IST

`బిచ్చ‌గాడు` సినిమాతో టాలీవుడ్‌పై దండ‌యాత్ర మొద‌లుపెట్టాడు విజ‌య్ ఆంథోని. కెరీర్ ఆరంభ‌మే 40 కోట్ల వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించాడు. ఆ క్ర‌మంలోనే మ్యూజిక్ డైరెక్ట‌ర్ కం హీరోగా విజ‌య్ పాపులారిటీ అటు త‌మిళ్‌, ఇటు తెలుగు రెండు చోట్లా రెట్టింపైంది. అత‌డు న‌టించే ప్ర‌తి సినిమా ఆల్మోస్ట్ ఇరు భాష‌ల‌కు స‌రిప‌డే కాన్సెప్టుల‌తో తెర‌కెక్కేవే. పైగా విజ‌య్ ఆంథోని కార్ప్ బ్యాన‌ర్ స్థాపించి భార్య ఫాతిమ పేరు మీద సినిమాలు తీసి రిలీజ్ చేస్తున్నారు విజ‌య్‌. ఇప్ప‌టికే అర‌డ‌జ‌ను పైగా చిత్రాలు తెలుగులోనూ రిలీజై విజ‌యం అందుకున్నాయి.

ఆ క్ర‌మంలోనే తాజా చిత్రం `కాళీ` (కాశీ-త‌మిళ్‌)ని తెలుగులో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. అందుకు సంబంధించి విజ‌య్ ఆంథోని కార్ప్ .. పిక్చ‌ర్ బాక్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్ర‌స్తుతం తెలుగు వెర్ష‌న్ అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. అయితే ఈ సినిమా రిలీజ్ ముంగిట వివాదాల్లోకి వెళ్లింది. పిక్చ‌ర్ బాక్స్ కంపెనీ ఒప్పందం ప్ర‌కారం చెల్లింపుల్లో ఫెయిలైంది. స‌కాలంలో డ‌బ్బు చెల్లించ‌లేదు… పైగా చెక్ బౌన్స్ అయ్యింద‌ని విజ‌య్ ఆంథోని కార్ప్ కోర్టుకు వెళ్లింది. ప్ర‌స్తుతం మ‌ద్రాసు హై కోర్టులో వివాదం న‌డుస్తోంది. ఈ సినిమా తెలుగు రైట్స్ ఎవ‌రికీ విక్ర‌యించ‌లేద‌ని, రిలీజ్ హ‌క్కులు పూర్తిగా త‌మ‌కే చెల్లుతాయ‌ని విజ‌య్ ఆంథోని కంపెనీ చెబుతోంది. ఆ మేర‌కు ఆర్థిక లావాదేవీల్లో గొడ‌వ న‌డుస్తోందని అధికారికంగా ప్రెస్‌నోట్‌ని రిలీజ్ చేశారు.