బిగ్ ట్వీట్: రోజాకు రాములమ్మ సపోర్ట్.. ఎందుకో తెలుసా..!

Tuesday, June 11th, 2019, 01:18:31 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి గత నెల ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా జగన్ తన మంత్రివర్గాన్ని కూడా ప్రకటించి 25 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం కూడా చేయించారు. అయితే ముందు నుంచి సీఎం జగన్ మంత్రివర్గంలో రోజాకు ఖచ్చితంగా స్థానం లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణాల అంశాలను పరిగణలోకి తీసుకున్న కారణంగా రోజాకు మంత్రివర్గ స్థానంలో చోటు లభించలేదు.

అయితే పార్టీలో సీనియర్ నేతగా, ముందు నుంచి పార్టీలో నమ్మకంగా ఉంటున్న రోజాకు జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేదని విజయశాంతి అభిప్రాయపడ్డారు. రోజా మంత్రి స్థానంపై స్పందిస్తూ విజయశాంతి తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్స్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియచేసారు. సినీ రంగానికి చెందిన ఎమ్మెల్యే రోజా కూడా జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. సినీ రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలు వినియోగించుకుని, వారికి కూడా తగిన గుర్తింపు ఇస్తే బాగుంటుందని నేను చెప్పదలుచుకున్నాను. రాబోయే రోజులలో అయినా ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారు రోజా విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆమెకు కూడా మంచి అవకాశాలు కల్పించాలని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ పెట్టారు. ఏదేమైనా రోజా మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో కాస్త నిరాశగానే ఉన్నారని వచ్చే రెండేళ్ల తర్వాత అయినా రోజాకు అవకాశం వస్తుందో లేదో చూడాలి మరీ.