రాముల‌మ్మ‌ మాట‌ల్లో ఆంత‌ర్య‌మేంటి?

Friday, July 12th, 2019, 08:19:02 AM IST

తెలంగాణ‌లో నియంత పాల‌న సాగుతోందా?. అందుకే కీల‌క నేత‌లెవ‌రూ పెద‌వి విప్ప‌డం లేదా? అంటే కాంగ్రెస్ స్టార్ క్యాపెయిన‌ర్ రాముల‌మ్మ విజ‌య‌శాంతి అవును అంటోంది. గ‌త కొంత కాలంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నియంతృత్వ ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తూ అడ్డొస్తున్న వారి గొంతు నొక్కుతున్నారు. గ‌త ఐదేళ్ల పాల‌న కేసీఆర్ ఇష్టారాజ్యంగా మారింద‌ని, ఇప్ప‌టికీ అదే ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రిస్తూ కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని, ఇంత కాలం తెరాస ప్ర‌భుత్వ హాయంలో అవినీతి తారా స్థాయికి చేరింద‌ని కాంగ్రెస్ ప్ర‌చార సార‌ధి విజ‌య‌శాంతి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెర‌గ‌డం ఆస‌క్తికరంగా మారింది.

అయితే సీఎం కేసీఆర్‌పై కేంద్రం నిఘా పెట్టింద‌ని చేసిన వ్యాఖ్య‌లు మాత్రం తెరాస‌లో క‌ల‌కలం సృష్టిస్తున్నాయి. కేంద్రం నిఘా పెట్ట‌డం సుభ‌ప‌రిణామ‌మ‌ని ప్ర‌భుత్వ అవినీతిని సాక్ష్యాధారాల‌తో బ‌య‌ట‌పెట్టిన తెరాస ప్ర‌భుత్వానికి చీమ కుట్టిన‌ట్టైనా లేద‌ని, ప్ర‌భుత్వం నిరంకుశంగా వ్య‌వ‌హ‌రిస్తూ అడుగ‌డుగునా ప్ర‌తిప‌క్షాల గొంతు నొక్కేస్తోంద‌ని మండిప‌డింది. అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తే ప‌రువున‌ష్టం దావా వేస్తామ‌ని బెదిరింపుల‌కు దిగ‌డంతో విజ‌య‌శాంతి కేసీఆర్ పాల‌న‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్‌పై కేంద్రం నిఘా పెడుతోంద‌ని, తెరాస పాల‌న‌లో జ‌రిగిన అవినీతిపై విచార‌ణ చేస్తుంద‌ని బీజేపీ నేత‌లు తాజాగా ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. తెరాస అవినీతిపై విచార‌ణ చేస్తే బంగారు తెలంగాణ ముసుగులో జ‌రుగుతున్న అక్ర‌మాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని విజ‌య‌శాంతి స్వ‌రం పెంచ‌డం కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపింది.