అప్పుడిచ్చిన హామీ నీటి మీద రాతలా మారింది – విజయశాంతి

Friday, February 19th, 2021, 04:01:20 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ప్రముఖ నటి, బీజేపీ నేత విజయశాంతి మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తే లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తం అని నేటి తెరాస పాలకులు గత అసెంబ్లీ ఎన్నిలప్పుడు ఇచ్చిన హామీ నీటి మీద రాతలా మారింది అని విజయశాంతి సెటైర్స్ వేశారు. ఎన్నికల హామీ అమలు కాలేదు సరికదా, పంటల సాగు కోసం రైతులు తీసుకున్న రుణాలను 5 రోజుల్లో రెన్యువల్ చేయకుంటే, చట్టపరమైన చర్యలు తప్పవు అంటూ కోర్టు ఖర్చులను కూడా వారే చెల్లించాలని అన్నదాతలకు బ్యాంక్ నుంచి నోటీసులు వస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇది చాలక బ్యాంక్ లో క్రాప్ లోన్ ఉందంటూ పింఛన్లు, రైతు బంధు కూడా ఆపుతున్నారు అంటూ విజయశాంతి సోషల్ మీడియా వేదిక గా పేర్కొన్నారు.

అయితే కొంతమంది రైతుల ఖాతాల నుంచి వడ్లు అమ్ముకున్న పైసల్ని కూడా ఇవ్వక లోన్ కింద జమ చేసుకున్నారు అని, పింఛన్, రైతు బంధు డబ్బుల్ని బాకీల కింద జమ చేసుకోవద్దని బ్యాంకులకు సర్కారు నుంచి స్పష్టంగా ఆదేశాలున్నప్పటికీ పట్టించుకునే దిక్కులేదు అని ధ్వజమెత్తారు. అయితే ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలోని పరిస్థితులివి అని, ఇక రాష్ట్రం మొత్తం మీద పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు అని, నిలదీసి ఏదైనా అడుగుదమంటే, చట్టం తెలిసిన వకీళ్ళకే రక్షణ లేకపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంథని తీరుగా హత్యలు కాబడుతున్నరు అని, గుర్రంపోడు లెక్క అన్యాయంపై కొట్లాడుదమంటే అరెస్టులు చేస్తున్నరు అని, కొట్టి కేసులు పెడుతున్నరన్న భయంతో తెలంగాణ సమాజం ఆందోళన చెందుతోంది అని వ్యాఖ్యానించారు.