కోవిడ్ వ్యాప్తికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే సగం కారణం అని స్పష్టం అవుతోంది – విజయశాంతి

Monday, April 19th, 2021, 08:24:12 AM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై మరొకసారి బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లో కోవిడ్ వ్యాప్తికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే సగం కారణం అని స్పష్టం అవుతోంది అంటూ విజయశాంతి పేర్కొన్నారు. అయితే గత మూడు నాలుగు రోజుల్లో మీడియా ద్వారా వెల్లడైన పరిశోధనాత్మక నివేదికలను పరిశీలిస్తే కరోనా కేసుల విషయం లో సర్కారు ఎంత గుట్టుగా వ్యవహరిస్తుందో తెలుస్తుది అని చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేట్ ల్యాబ్స్ లో చేస్తున్న పరీక్షలు, బులిటెన్ ద్వారా ప్రకటిస్తున్న ఫలితాలు వాస్తవ గణాంకాలకు ఏ మాత్రం పొంతన లేదని ఆ నివేదికలు ఆధారాలతో సహా నివేదించాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రభుత్వ వర్గాల అంకెలు వందల్లో ఉంటే, వాస్తవ పరిశోధన ప్రకారం ఈ కేసులు వేలల్లో కనిపిస్తున్నాయి అని వ్యాఖ్యానించారు.

అయితే గతేడాది ప్రభుత్వ వెబ్ సైట్ లో కరోనా కేసుల గణాంకాలను కొన్నాళ్ళు అప్డేట్ చేయకుండా ఆపేస్తే హైకోర్ట్ మందలింపు ల తర్వాత మళ్లీ కొనసాగించారు అని గుర్తు చేశారు. అయితే ఈ వ్యవహారం ఉద్దేశ్య పూర్వకంగానే జరుగుతున్నట్టు అప్పట్లో హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది అని అన్నారు. ఇదంతా ఒక కొనమైతే, పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో నెలకొని ఉన్న పరిస్థితులు నరకానికి నకళ్ళు గా ఉన్నాయి అని తెలిపారు. అయితే కరోనా అనుమానితులు, ఆరోగ్యం గా ఉన్నవారు, రకరకాల వ్యాధిగ్రస్తులు, అందరినీ గుంపులుగా గంటల తరబడి భౌతిక దూరం, శానిటైజేశన్, ఇతర జాగ్రత్తలేవి లేకుండా ఒకే చోట నిలబెట్టి టెస్టులు చేస్తున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. ఇదెంత ప్రమాదకరమో పాలకులకు తెలియదా అంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రజారోగ్యాన్ని పక్కన పడేసి, జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న ఈ పాలకుల పట్టింపులేని తనమే వారి పతనానికి నాంది అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.