విజ‌య‌శాంతి మేనేజ‌ర్ కిడ్నాప్‌

Friday, May 18th, 2018, 02:34:16 AM IST

కాంగ్రెస్ నేత, సీనియర్ నటి విజయశాంతి మేనేజర్‌ సైదాచారి కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ కిడ్నాప్‌కి ఆర్థిక వ్య‌వ‌హారాలే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అస‌లు వివ‌రంలోకి వెళితే..

దాదాపు ప‌దేళ్లుగా న‌టి విజ‌య‌శాంతికి మేనేజ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు సైదాచారి. అత‌డు ఓ మ‌హిళ వ‌ద్ద డ‌బ్బు అప్పు తీసుకుని తిరిగి చెల్లించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. ఆ క్ర‌మంలోనే ప‌దే ప‌దే డ‌బ్బు అడిగి విసిగిపోయిన స‌ద‌రు మ‌హిళ కిడ్నాపర్లను రంగంలోకి దించింది. ఎనిమిది మంది కిడ్నాప‌ర్ల బృందం సైదాచారిని భువ‌నగిరి జిల్లాలో ఓ మారుమూల ప్రాంతంలో కిడ్నాప్ చేశారు. రూ. 50 లక్షలు ఇస్తే విడిచిపెడతామని దుండ‌గులు డిమాండ్ చేశారు. అయితే సైదాచారి కుటుంబ స‌భ్యుల‌కు ముందే అనుమానం రావ‌డంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్ర‌మంలోనే స్థానిక పోలీసులు రంగంలోకి దిగి.. చాకచక్యంగా దుండ‌గుల్ని ప‌ట్టుకున్నారు. సైదాచారిని కిడ్నాప్ చేసిన 8 మంది కిడ్నాప‌ర్ల‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.