రాష్ట్ర ప్రజలు ఇంకాస్త భీతిల్లిపోయే పరిస్థితి వచ్చింది – విజయశాంతి

Saturday, May 1st, 2021, 10:30:49 PM IST

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూ కబ్జాల ఆరోపణల కారణంగా ఈటల నిర్వహిస్తున్న వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేశారు. తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈటలపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో వైద్యఆరోగ్యశాఖ నుంచి ఆయనను తప్పించాలని సీఎం కేసీఆర్ గవర్నర్‌కు సిఫారసు చేస్తూ ఆ శాఖను తనకు కేటాయించాలని ప్రతిపాదించారు. అయితే దీనికి గవర్నర్ కూడా ఆమోదముద్ర వేశారు. దీనిపై స్పందించిన బీజేపీ నాయకురాలు విజయశాంతి కారణాలు ఏవైనప్పటికీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సీఎం కేసిఆర్ గారి నిర్వహణలోకి వచ్చిందని, ఈ పరిణామంతో రాష్ట్ర ప్రజలు ఇంకాస్త భీతిల్లిపోయే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు.

ఒక పక్క రాష్ట్రంలో కరోనా కట్టడి తీరుపై దాదాపు రోజువారీగా నడుస్తున్న విచారణలో పాలకులు హైకోర్టు మందలింపులు, హెచ్చరికలకు గురవుతున్నారు. ఇలాంటి దుస్థితిలో అసలు దర్శనం దొరకడమే కష్టంగా మారిన సీఎం గారి చేతికి వైద్య-ఆరోగ్య శాఖ వెళ్ళింది. స్వయంగా ఆయనే కరోనా నిబంధనలు ఉల్లంఘించి కోవిడ్ బారిన పడిన వ్యక్తి అని విజయశాంతి ఎద్దేవా చేశారు. ఆయనతో పాటు కుమారుడు, మంత్రి అయిన కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్.. ఇలా గులాబీ దళం నేతలు చాలా మంది కరోనాకు గురయ్యారని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అత్యున్నత స్థాయి అధికారులకు సైతం అందుబాటులో ఉండని కేసీఆర్ చేతికి అది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య, ఆరోగ్య శాఖ వెళ్ళడం ప్రజల్ని కలవరానికి గురిచేస్తోందని అన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి చేతుల్లో పడినందుకు కాపాడమంటూ.. కుచ్ “కరోనా” భగవాన్ అని తెలంగాణ ప్రజలు దేవుడిపైనే భారం మోపి కాలం వెళ్ళబుచ్చుతున్నారనేది నేటి కఠోర వాస్తవమని విజయశాంతి అన్నారు.