రైతులు పడుతున్న వేదన చూస్తుంటే కడుపు రగిలిపోతోంది – విజయశాంతి

Friday, June 11th, 2021, 12:52:08 AM IST

తెలంగాణ సర్కార్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ పాలకులు ఈ రాష్ట్రాన్ని ఏం చెయ్యాలనుకుంటున్నారో.. ఎటు తీసుకుపోతున్నారో.. ఊహిస్తుంటే భయమేస్తోందని, ధాన్యం కొనుగోలు తీరుపై రైతాంగం దాదాపు నెల రోజులుగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నా సర్కారుకు చీమ కుట్టినట్టయినా లేదని అన్నారు. ధాన్యం కొనుగోళ్ళలో ప్రభుత్వం చేసిన తీవ్ర జాప్యంతో అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారి వారిని నడి రోడ్డుకీడ్చాయని అన్నారు. తడిసిన, రంగు మారిన, మొలకలెత్తిన ధాన్యంతో రైతులు పడుతున్న వేదన చూస్తుంటే కడుపు రగిలిపోతోందని విజయశాంతి అన్నారు.

రాష్ట్ర సర్కారు సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ అకాల వర్షాల ధాటికి తెలంగాణ రైతులు ఇంతగా నష్టపోయి ఉండేవారు కాదన్నది పరమ సత్యం అంటూ, వ్యవసాయదారులను నిలువునా ముంచెత్తిన వానలకు అధికారుల నిర్లక్ష్యం కూడా తోడైన ఫలితాన్ని ఇప్పుడు తాము కూడా అనుభవించాలేమోనని ప్రజలు కూడా ఆందోళన పడుతున్నారు. కిందటేడాది కురిసిన వానలు సృష్టించిన బీభత్సం నుంచి నేటికీ హైదరాబాద్, వరంగల్ పౌరులు తేరుకోలేదు. నాటి వర్షాల దెబ్బకు నీట మునిగిన ఈ నగరాల్లోని పలు ప్రాంతాలు నెలల తరబడి సాధారణ జీవనానికి దూరమయ్యాయి. నిజం చెప్పాలంటే నేటికీ ఆ ప్రాంతవాసులు పూర్తిగా తేరుకోలేదు. ఆ ప్రాంతాల్ని సర్కారు కూడా పూర్తిగా పునరుద్ధరించలేదు. ఇంతలోనే వానాకాలం చేరువ కావడంతో కాలువలై పారే రోడ్లు.. చెరువుల్ని తలపించే కాలనీలు.. ఏ మాత్రం పట్టింపులేని సర్కారు నిర్లిప్త వైఖరిని తల్చుకుని జనం కలవరపడుతున్నారని విజయశాంతి చెప్పుకొచ్చారు.

కరోనా కష్టాల మధ్య రైతుల వెతలు ఒకవైపు.. వానా కాలంలో స్తంభించే జన జీవనం మరొకవైపు.. తమ లాభం మాత్రమే చూసుకునే సర్కారు పెద్దల తీరు ఇంకొకవైపు హామీల మూటలు చూపిస్తూ పబ్బం గడుపుకునే ఈ సర్కారు ఈ వానల్లోనే కొట్టుకుపోవాలని జనం కోరుకుంటున్నారనడంలో సందేహం లేదని అన్నారు.