పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన విజయశాంతి..!

Monday, August 19th, 2019, 12:00:37 AM IST

తెలంగాణలో ఈ సారి జరిగిన ముందస్తు ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో వరుసగా రెండో సారి గెలిచి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పొత్తులో సైతం కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే గెలిచిన ఎమ్మెల్యేలు కూడా సగానికి పైగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీనీ వీడి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అయితే మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికలలో 3 ఎంపీ సీట్లు గెలిచినా పార్టీలోని నేతలు మాత్రం కాంగ్రెస్‌పై కాస్త వెనకడుగు ధోరణిలోనే ఉన్నారు.

అయితే కాంగ్రెస్ మహిళా నాయకురాలు, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి పార్టీ మారుతున్నారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన విజయశాంతి నేడు మీడియాతో మాట్లాడుతూ గాంధీభవన్ లో కొందరు తనపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా అని నాపై వస్తున్న వార్తలు నిజం కాదని, తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారం గాంధీ భవన్ లోనే ప్రారంభమైందని అన్నారు. పార్టీ విడిచి వెళ్లాలనుకుంటే బహిరంగంగానే ప్రకటిస్తానని, హడావుడి నిర్ణయాలు తీసుకోనని స్పష్టం చేశారు.