దారుణం: పింఛన్ సొమ్ముతో ఉడాయించిన గ్రామ వాలంటీర్..!

Friday, July 3rd, 2020, 12:42:30 AM IST

ఏపీలో వృద్ధులు, వికలాంగులకుగాను ఇచ్చేందుకు వచ్చిన పింఛను సొమ్ముతో ఓ గ్రామ వాలంటీర్ పారిపోయాడు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన హనుమంతు నాయక్ ఆ గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు.

అయితే జూలై నెలకు సంబంధించి 49 మందికి అతగాడు పింఛను అందించాల్సి ఉండగా, ఆ డబ్బులను గ్రామ సచివాలయం వెల్ఫేర్ ఆఫీసర్ హీరా నుంచి 63,500 తీసుకున్నాడు. జూలై 1వ తేదీన లబ్ధిదారులకు అందించాల్సి ఉండగా హనుమంతు ఎంతకూ రాలేదు. దీంతో లబ్ధిదారులే గ్రామ సచివాలయానికి వెళ్లి పింఛను డబ్బుల గురించి అడిగారు. అయితే షాకైన సిబ్బంది ఇంటికి వెళ్లి చూడగా, అక్కడ కూడా ఆయన కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అతడు డబ్బులు తీసుకుని పరారైనట్టు నిర్ధారించి హనుమంతు మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.