వినాయక్ మరొక రొటీన్ మాస్ మసాలా ఇంటిలిజెంట్!

Friday, February 9th, 2018, 05:47:16 PM IST

మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మేకప్ వేసుకున్న తొలి చిత్రం రేయ్ అయినప్పటికీ విడుదలయింది మాత్రం పిల్ల నువ్వులేని జీవితం చిత్రమే. కెరీర్ ప్రారంభంలోనే ఆ చిత్రం తో మంచి విజయం అందుకున్న ఆయన, ఆ పై సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్, సుప్రీమ్ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను ద‌క్కించుకున్నారు. ఆ తరువాత మాత్రం ఆయనకు సరైన హిట్ దక్కలేదనే చెప్పాలి. ధరమ్ తేజ్ న‌టించిన గ‌త నాలుగు చిత్రాలు ఆయనకు ప‌రాజ‌యాన్ని రుచి చూపించాయి. ఇలాంటి త‌రుణంలో అయన మామయ్య మెగాస్టార్ చిరంజీవి తో ఖైదీ నెంబర్ 150 చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్న క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల ద‌ర్శకుడు వి.వి.వినాయ‌క్, సాయిధ‌ర‌మ్ తో సినిమా చేయ‌నుండడంతో ఆ సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్పడ్డాయి.

టైటిల్ నిర్ణయం నుండి మొన్న జరిగిన ప్రీరిలీజ్ వేడుక వరకు అన్నింటా మంచి హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం చిత్రానికి ప్రతికూల స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్న సాయి ధరమ్ తేజ్ కి మరోసారి నిరాశే ఎదురైందని, పాత కథకు కొత్త రంగులు అద్ధే ప్రయత్నంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడని అంటున్నారు. ఏమాత్రం ఇంటిలిజెంట్ గా లేని కథ, కథనాలు, బోర్ కొట్టించే ఫైట్లు, రొటీన్ కామెడీ, పెద్దగా ఆకట్టుకొని పాటలు, పర్వాలేదనిపించే మెగాస్టార్ రీమిక్స్ సాంగ్ వెరసి చిత్రం ఒక ఫక్తు రొటీన్ మాస్ మసాలా చిత్రం అని వార్తలు వస్తున్నాయి. అయితే తొలిరోజున టాక్ ని బట్టి పూర్తి సినిమా ఫలితాన్ని నిర్ణయించలేము కనుక ఇంకొద్ది రోజులు గడిస్తేగాని ఇంటిలిజెంట్ బాక్స్ ఆఫీస్ ముందు ఏ స్థాయిలో నిలబడతాడో చెప్పలేము….