వైరల్ బారసాల: బుజ్జి పాపలకు కాదు.. బుజ్జి కుక్క పిల్లలకు..!

Sunday, June 2nd, 2019, 09:16:58 PM IST

తెలంగాణ సిద్దిపేట జిల్లాలో ఓ వింత బారసాల జరిగింది. ఇంతకీ ఏమిటది అనుకుంటున్నారా? సాధారణంగా ఇంట్లో బిడ్డ పుడితే 21వ రోజున బారసాల కార్యక్రమం నిర్వహించి పాపాయిని ఉయ్యాలలో వేయడం, పేరు పెట్టడం ఆచారం. ఇది రెగ్యులర్‌గా మనం చూసే తంతే. కానీ సిద్దిపేటలో మాత్రం ఒక మహిళ తన పెంపుడు కుక్క కన్న పిల్లలకు బారసాల కార్యక్రమం నిర్వహించింది. జిల్లాలోని దుబ్బాకలో సారంపల్లిలో దేవవ్వ అనే మహిళ ఒక శునకాన్ని అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. ఆ కుక్క ఈ మధ్యే ఏడు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. తను ప్రేమగా చూసుకునే కుక్క పిల్లలకు బారసాల నిర్వహించాలని తలంచింది సదరు మహిళ. అనుకున్నదే తడవుగా కుక్క పిల్లలకు సరిపోయే బుజ్జి, బుజ్జి బట్టలు కుట్టించింది.

ఇంతటితో ఆగకుండా ఇరుగు పొరుగు వారిని పిలిచి పిల్లలన్నీటిని ఉయ్యాలలో వేసి ఊపుతూ పాటలు కూడా పాడింది. అతిధులు కూాడా ఆమెతో గొంతు కలిపారు. బారసాలకు వచ్చిన ప్రతీ ఒక్కరికి భోజనం కూడా పెట్టి పంపించింది దేవవ్వ. ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో గంటల్లోనే వైరల్‌గా మారింది. మనుషులనే పట్టించుకోని ఈ రోజుల్లో పెంచుకుంటున్న కుక్క పట్ల ఇంత అభిమానాన్ని చూపించిన దేవవ్వను నెటిజన్‌లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.