ప‌వ‌న్ ఎక్స్ హీరోయిన్ వీరంగం

Friday, September 7th, 2018, 06:26:29 PM IST

పిల్ల‌ల గొడ‌వ‌ల్లో పెద్ద‌లు త‌ల‌దూర్చ‌డం స‌హ‌జం. మావాడిని కొట్టేశాడే అంటూ వీధిన‌ప‌డి వీరంగం వేసే సెల‌బ్రిటీల‌కు కొద‌వేం లేదు. క‌య్య‌మాడేందుకు సెల‌బ్రిటీ ఏంటి? పేద‌, బీద, బ‌క్క‌ ఏంటి? ఎవ‌రైనా రోడ్డున ప‌డ‌డం స‌హ‌జంగా జ‌రిగేదే. ఇదిగో ఈ గొడ‌వ అలాంటిదే. ముంబై ఖ‌ర్ ఏరియాలో ఈ త‌ర‌హా గొడ‌వ ఒక‌టి పోలీస్ గ‌డ‌ప వ‌ర‌కూ వెళ్ల‌డం హాట్ టాపిక్ అయ్యింది. అందునా ఈ గొడ‌వ‌లో ఉన్న‌ది ప‌వ‌న్ హీరోయిన్ ప్రీతి జింగానియా కావ‌డంతో ఒక‌టే ర‌చ్చ‌వుతోంది. అస‌లింత‌కీ ఏమైంది? అన్న వివ‌రాల్లోకి వెళితే…

ప‌వ‌న్ స‌ర‌స‌న త‌మ్ముడు చిత్రంలో న‌టించింది ప్రీతి జింగానియా. పెద‌వి దాట‌ని మాటొక‌టుంది.. అంటూ క్యూట్ అప్పియ‌రెన్స్‌తో ఆక‌ట్టుకున్న ఈ భామ ఆ త‌ర్వాత ఇక్క‌డ ఆశించిన స్టార్‌డ‌మ్ ని అందుకోలేక‌పోయింది. ఆ క్ర‌మంలోనే బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్క‌డ కూడా కెరీర్ ప‌రంగా అంతంత మాత్ర‌మే. అటుపై ముంబై బిజినెస్‌మేన్ ప్ర‌వీణ్ దాబాస్‌ని పెళ్లాడింది. ఈ జంట‌కు జ‌య్‌వీర్ అనే ఏడేళ్ల పిల్లాడు ఉన్నాడు. జ‌య్‌వీర్ ఆట‌ల్లో మేటి. అత‌డు పక్క అపార్ట్‌మెంట్‌కి వెళ్లి ఆడుకుంటుండ‌గా జ‌రిగిన గొడ‌వ చినికి చినికి గాలివానైంది. ఈ గొడ‌వ‌లో అవ‌త‌లి కుర్రాడు వీడిని పొట్ల‌లో పిడిగుద్దులు గుద్దేయ‌డం.. పైగా ఆ పిల్లాడి తాత ఆరిఫ్ ఈ గొడ‌వ‌లో త‌ల‌దూర్చి జ‌య్‌వీర్ ని వాచ్‌మేన్‌తో మెడ ప‌ట్టి గెంటించేయ‌డంతో గొడ‌వ కాస్త పెద్ద‌దైంది. ఈ వివాదంలో వారించాల‌ని చూసిన ఐశ్వ‌ర్యారాయ్ క‌జిన్‌ని అత‌డు ఎడాపెడా తిట్టేశాడు. మైండ్ యువ‌ర్ బిజినెస్! అంటూ వార్నింగ్ ఇచ్చాడుట‌. అయితే కొడుకు త‌గువు గురించి తెలుసుకుని త‌ల్ల‌డిల్లిపోయిన ప్రీతి జింగానియా ఆ త‌ర్వాత భ‌ర్త ప్ర‌వీణ్‌తో క‌లిసి ఖ‌ర్ పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లింది. అక్క‌డ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ప్ర‌స్తుతం పోలీసులు ఏం జ‌రిగిందో విచారిస్తున్నారు. ప్రీతి కుమారుడు ఏడేళ్ల చంటిగాడు జ‌య్‌వీర్ స్కూల్ కెళ్ల‌న‌ని, అన్నం తిన‌న‌ని మారాం చేస్తున్నాడ‌ట‌. ఎంకి చావు సుబ్బికొచ్చిన‌ట్టు ఈ గొడ‌వ‌లో పోలీసులు ఎంతో సంయ‌మ‌నంగా వ్య‌వ‌హ‌రిస్తూ సామరస్యంగా ఓ కొలిక్కి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారిపుడు.

  •  
  •  
  •  
  •  

Comments