వైజాగ్‌లో ఫిలింఛాంబ‌ర్ కార్యాల‌యం

Saturday, May 26th, 2018, 11:02:39 AM IST

ఏపీ నుంచి తెలంగాణ విడిపోయాక న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌కు సినీప‌రిశ్ర‌మ త‌ర‌లి వెళ్లిపోతోంద‌ని ప్ర‌చార‌మైంది. ఆ క్ర‌మంలోనే వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ ప‌రిస‌రాల్లో ప‌రిశ్ర‌మ ఏర్పాటున‌కు సంబంధించిన ఏర్పాట్లు సాగాయి. వైజాగ్ బీచ్ ప‌రిస‌రాల్లో ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో ఇండ‌స్ట్రీ ఏర్పాటున‌కు పునాది రాయి కూడా వేశారు. అప్ప‌ట్లో తెలుగు ఫిలింఛాంబ‌ర్ ఏర్పాటున‌కు కాపులుప్పాడ ప‌రిస‌రాల్లో కొంత స్థ‌లం కేటాయించి పునాది రాయి వేశారు. కానీ మ‌ధ్య‌లో కొన్ని అడ్డంకులు ఏర్ప‌డ‌డం, అటుపై రాజ‌ధాని నిర్మాణం హ‌డావుడిలో ప‌డిపోవ‌డంతో ఆ క్ర‌మంలోనే సినీపెద్ద‌లు వెళ్లి బాబును క‌లిసి ముచ్చ‌టించారు. ఓ కొత్త సినీప‌రిశ్ర‌మ బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో పాదుకొన‌డం ఖాయం అన్న మాట ప‌రిశ్ర‌మ పెద్ద‌ల్లో వినిపిస్తోంది. వైజాగ్ నుంచి అర‌కు మ‌ధ్య‌లో హైద‌రాబాద్‌ను మించి చ‌ల్ల‌ద‌నం ఉన్న ప‌రిస‌రాల ఉండ‌డంతో అక్క‌డే ప‌రిశ్ర‌మ ఏర్పాటున‌కు అనుకూలం అన్న వాద‌నా ఇటీవ‌ల తెర‌పైకొచ్చింది.

అదంతా అటుంచితే విశాఖ‌లో ఫిలింఇండ‌స్ట్రీ కార్య‌క్ర‌మాల జోరు అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇటీవ‌లే ప‌రిశ్ర‌మ అగ్ర‌నిర్మాత‌, మెగా నిర్మాత అయిన కె.ఎస్‌.రామారావు ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ (వైజాగ్ ఎఫ్ఎన్‌సీసీ)ని ప్రారంభించారు. ఈ క్ల‌బ్‌లో ఇప్ప‌టికే 200 మంది చేరారు. ఆ క్ర‌మంలోనే వైజాగ్‌లోని మిధిలాపురి ఉడా కాల‌నీలో ఎంవీవీ భ‌వ‌నంలో ఫిలింఛాంబ‌ర్ కార్యాల‌యాన్ని ప్రారంభించ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. సినీప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన అన్ని విష‌యాల్ని హైద‌రాబాద్, విశాఖ నుంచి తెలుసుకోవ‌చ్చ‌ని న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ ఎస్‌.వి.ఎన్‌.రావు ప్ర‌క‌టించారు. 90శాతం షూటింగులు వైజాగ్‌లోనే జ‌రుగుతున్నాయి కాబ‌ట్టి, ఇక్క‌డి నుంచే అన్ని కార్య‌క్ర‌మాలు సాగుతాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఇక‌పోతే వైజాగ్‌లో కార్య‌క‌లాపాల విస్త‌ర‌ణ‌కు ఇత‌ర‌త్రా సినీపెద్ద‌లు ఆస‌క్తిగా ఉన్నారని, ప్ర‌స్తుతానికి ఇది నివురుగ‌ప్పిన నిజం లాంటిద‌ని చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments