వీఆర్వో వ్య‌వ‌స్థ ఢ‌మాల్.. ఏపీలో కొత్త భూచ‌ట్టం?

Monday, July 22nd, 2019, 01:22:19 PM IST

100 గ‌జాలు కొనుక్కోవాలంటే సామాన్యుడికి ఎన్ని తిప్ప‌లో తెలిసిందే. తీరా కొన్న త‌ర్వాత అది ఎంత‌మందికి రిజిస్ట్రేషన్ అయ్యిందో కూడా చెప్ప‌లేని పరిస్థితి. ఇలాంటి వివాదాలు తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బ‌డి ముబ్బ‌డిగా ఉన్నాయి. రెవెన్యూ అధికారులు- వీర్వోల్ని ఇళ్ల‌కు ర‌ప్పించుకుని రాజ‌కీయ నాయ‌కులు రిజిస్ట్రేష‌న్లు మార్చి భూ క‌బ్జాల‌కు పాల్ప‌డిన కుంభ‌కోణాలు అట్టుడికిస్తున్నాయి. హైద‌రాబాద్- విజ‌య‌వాడ‌- వైజాగ్- తిరుప‌తి స‌హా ప‌లు న‌గ‌రాల్లో ఈ దందాలు మ‌రీ తీవ్రంగా ఉన్నాయి. వేలు ల‌క్ష‌ల కోట్ల ప్ర‌భుత్వ భూములు కైంక‌ర్యం అయిపోయాయి.

అయితే ఈ భూదందా విష‌యంలో రెవెన్యూ వ్య‌వ‌స్థను ప్ర‌క్షాళ‌న చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ శ‌ర‌వేగంగా పావులు క‌ద‌ప‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. తాజాగా మ‌రోసారి కేసీఆర్ తెలంగాణ‌లో రెవెన్యూ వ్య‌వ‌స్త‌ను ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నార‌ట‌. ఇందులో భాగంగానే విలేజ్ వీఆర్వో వ్య‌వ‌స్థ‌ను ఎత్తేయ‌బోతున్నార‌న్న టాక్ వేడెక్కిస్తోంది. రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే సూచనలను సీఎం కెసిఆర్ అధికారుల‌కు సూచించార‌ట‌. దీంతో స‌రికొత్త‌గా ప్రవేశపెట్టబోయే కొత్త భూ చట్టంపై కసరత్తు జరుగుతోంది. భూ వివాదాలను నివారించడానికి “టైటిల్ గ్యారెంటీ“ అనే బ‌ల‌మైన‌ చట్టం తీసుకువచ్చేందుకు క‌స‌ర‌త్తు సాగుతోంది. దీంతో వీఆర్వో వ్యవస్థను రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

వీఆర్‌ఓలు గ్రామాల్లో ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. భూమి ఖర్చులు పెరగడంతో రిజిస్ట్రేషన్లపై వివాదాలు దారుణంగా పెరిగాయి. సరిహద్దుల్లో లోపాలు ఘోరం.. పైగా న‌లుగురు ఐదుగురికి ఒకే సారి రిజిస్ట్రేష‌న్ చేసేస్తున్నాయి రిజిస్ట్రార్ ఆఫీసులు. చట్టాలపై వీఆర్‌ఓలలో అవగాహన లేకపోవడం కూడా ఎక్కువ పొరపాట్లు జరుగుతున్నాయ‌ని విశ్లేషించారు. అందుకే ఇప్పుడు వీఆర్వో వ్య‌వ‌స్థ‌ను ఎత్తేసేందుకు క‌స‌ర‌త్తు సాగుతోంద‌ట‌. అయితే ఇదే త‌ర‌హా ప్ర‌క్షాళ‌నను కొత్త సీఎం జ‌గ‌న్ ఏపీలోనూ అమ‌లు చేసే వీలుంద‌ని తాజాగా ఓ వార్త లీకైంది. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే అక్క‌డ వీఆర్వోల గుండెల్లో రాళ్లు ప‌డిన‌ట్టేన‌న్న విశ్లేష‌ణ సాగుతోంది.