లేటెస్ట్ : శ్రీదేవి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఆ ఇద్దరు సీనియర్ నటులు!

Sunday, February 25th, 2018, 01:08:08 PM IST

సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ శ్రీదేవి మా ఇంట్లో ఎదిగిన అమ్మాయి అన్నారు. శ్రీదేవి చిన్నప్పటి నుండి చాలా చలాకీగా ఉండేదని, తనతో కలిసి చాలా చిత్రాల్లో నటించానని, నటనకు కొత్త భాష్యం చెప్పిన వ్యక్తి ఆమె అన్నారు. ఆమె మరణం పట్ల సూపర్‌స్టార్‌ కృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త విని వినగానే భూకంపం వచ్చినట్టు కంపించిపోయానని తెలిపారు. నరేశ్‌, శ్రీదేవి చిన్ననాటి స్నేహితులని చెప్పారు. శ్రీదేవి తమ ఇంటికి తరచు వస్తుండేదని, అందరితో ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేదని, చెన్నైలో తమవి పక్కపక్క ఇళ్లు అని వెల్లడించారు. ఆ భగవంతుడు ఈ వార్తను తట్టుకునే శక్తిని, ధైర్యాన్ని ఆమె కుటుంబానికి ప్రసాదించాలని అన్నారు.

ప్రముఖ నటీమణి శ్రీదేవి అకాల మరణం భారతీయ సినిమా పరిశ్రమను షాక్‌కు గురి చేసిందని సీనియర్ నటుడు కృష్ణంరాజు అన్నారు. శ్రీదేవి పోషించిన పాత్రల్లో ఎవరూ చేయలేనంత గొప్పగా నటించిందని కొనియాడారు. తనతో సినిమా చేస్తున్నపుడు ఆమె అందించిన సహకారం మరువలేనిదని , అందరితోనూ చాలా కలుపుగోలుగా, సెట్‌లో ఆమె చాలా హుందాగా, గౌరవంగా వ్యవహరించేదని గుర్తు చేసుకున్నారు. మనకు ఉన్న అప్పటితరం నటీమణులు భానుమతి, సావిత్రి మినహాయిస్తే దాదాపుగా శ్రీదేవితో పోల్చదగిన నటులు ఎవరూ లేరని కొనియాడారు. మొదటి నుండి కష్టపడి పనిచేసే మనస్తత్వం తనది అన్నారు. కూతుళ్ల భవిష్యత్‌ చూడకుండా ఆమె వెళ్లిపోవడం దురదృష్టకరమని, శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు…