‘వెస్టిండీస్ ఏ’ జట్టుపై ‘భారత ఏ’ జట్టు విజయం

Sunday, September 15th, 2013, 08:08:56 PM IST

team
వెస్టిండీస్ ఏ జట్టుతో జరిగిన తొలి అనధికారిక వన్డేలో భారత ఏ జట్టు విజయం సాధించింది. కెప్టెన్ యువరాజ్ సింగ్ అద్బుత సెంచరీతో చెలరేగగా.. యూసుఫ్ పఠాన్ సునామీలా విరుచుకుపడ్డాడు. దీంతో భారత్ 312 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో తడబడిన విండీస్ 235 పరుగులకే ఆలౌటైంది.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్ ఏ, వెస్టిండీస్ ఏ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. 50 ఓవర్ల మ్యాచ్ ను 42 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత ఓపెనర్లు ఊతప్ప, ఉన్ముక్త్ చంద్ లు విఫలమయ్యారు.. ఆ తర్వాత మన్ దీప్, యువరాజ్ సింగ్ లు విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. మన్ దీప్ సింగ్ 67 పరుగులు చేసి అవుటయ్యాడు.

భారత జట్టులో రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న యువరాజ్ సింగ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. తన కసినంతా విండీస్ బౌలర్లపై చూపించి.. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 80 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఏడు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 123 పరుగులు చేశాడు.. మరో ఎండ్ లో యూసుఫ్ పఠాన్ కూడా సుడిగాలిలా రెచ్చిపోయాడు. కేవలం 32 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, 4 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. దీంతో భారత్ 42 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది.

313 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. డియోనరేన్ , నర్స్ లు హాఫ్ సెంచరీలతో ఫరవాలేదనిపించారు. మిగిలిన ఏ ఒక్క బ్యాట్స్ మెన్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో విండీస్ పరాజయం ఖాయమైంది. భారత బౌలర్లలో వినయ్ కుమార్ , నర్వాల్ , రాహుల్ శర్మ, యూసుఫ్ పఠాన్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో వెస్టిండీస్ 235 పరుగులకే ఆలౌటైంది.

మొత్తానికి రీ ఎంట్రీ కోసం ట్రై చేస్తున్న యువీ సెంచరీతో సత్తా చాటి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇక వెస్టిండీస్ ఏ జట్టుపై తొలి వన్డేలో గెలిచిన భారత్ మూడు వన్డేల సిరీస్ లో 1-౦ ఆధిక్యం సంపాదించింది.