నా పేరు సూర్య చూసి త్రివిక్రమ్ ఏమన్నారంటే?

Sunday, May 6th, 2018, 05:24:44 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రచయిత వక్కంతం వంశి తొలిసారి మెగా ఫోన్ పట్టిన చిత్రం నా పేరు సూర్య. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే కొందరు ప్రముఖులు చిత్రం బాగుందని, బన్నీ యాక్షన్ అదరగొట్టాడని అంటున్నారు. ఇక ఈ చిత్రం చూసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన స్పందనను దర్శకుడు వంశీకి కాల్ చేసి చెప్పారని వంశి నిన్న ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.

త్రివిక్రమ్ ముఖ్యంగా కథనాన్ని పక్కదారి పట్టించే కమర్షియల్ అంశాలపై వెళ్లకపోవడాన్ని మెచ్చుకున్నారని, చిత్రం ఆద్యంతం చూస్తుంటే ఇదేదో మంచి అనుభవమున్న దర్శకుడు తీసినట్లుండే తప్ప, కొత్త దర్శకుడు తీసినట్లు లేదని అన్నారట. అలానే బన్నీ నటనను కూడా త్రివిక్రమ్ మెచ్చుకున్నారని, సూర్య పాత్రలో జీవించాడని అన్నారని చెప్పారు. రచయిత గా వున్న త్రివిక్రమ్ తరువాత నువ్వే నువ్వే చిత్రంతో డైరెక్టర్ గా మారారు. నిజానికి ఆయన పబ్లిక్ గా మాట్లాడడం అరుదు.

తన చిత్రాల ప్రమోషన్లలో కూడా ఆయన పెద్దగా పాల్గొనరు. అయితే ఏవైనా చిత్రాలు తనకు నచ్చినప్పుడు ఆ చిత్రంలోని వ్యక్తులకు ఫోన్ చేసి అభినందించడం ఆయనకు అలవాటు. అలానే ప్రస్తుతం వంశీకి ఫోన్ చేసి అబినందించారట. ఒక అగ్ర దర్శకుడు అయివుండి మరొక దర్శకుడి చిత్రాన్ని త్రివిక్రమ్ అభినందించడం ఆరోగ్యకర పరిణామమని, ఇలాంటి ఘటనల వల్ల ఆయా దర్శకులు, నటులు, నిర్మాతలు మరిన్ని మంచి చిత్రాలు తీయడానికి అవకాశం ఉంటుందని పలువురు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు……