టాలీవుడ్ హీరోల రహస్య భేటీలో ఏమి తేల్చారు?

Wednesday, April 25th, 2018, 10:03:54 AM IST

గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో జరిగిన పరిణామాల దృష్ట్యా తెలుగు సినిమా ప్రతిష్ట మసకబారుతోందని, ఇకనైనా ఇటువంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సినీ హీరోలు నిర్ణయించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే నిన్న ఈ విషయమై టాలీవుడ్ కు చెందిన అగ్ర హీరోలు అందరూ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో ఒక భేటీ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మా సభ్యలు కూడా కొందరు ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మొదట అసలు శ్రీరెడ్డి వ్యవహారం ఇక్కడవరకు వచ్చేదాకా ఉండకుండా,

మొదట్లోనే సరైన పరిష్కారం చూపినట్లైతే బాగుండేదని కొందరు అన్నారట. అంతే కాదు ముఖ్యంగా కొద్దిరోజుల క్రితం కొన్ని న్యూస్ చానెల్స్ లో సినిమా వాళ్లకు సంబంధించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, కించపరిచే విధంగా వ్యవహరించడం వంటివి చేస్తున్నాయని, అందువల్ల ఇకపై న్యూస్ చానెల్స్ లో సినిమాలకు సంబందించిన ప్రొగ్రమ్ లు ప్రసారం చేయకుండా, అలానే ట్రైలర్ లు, టీజర్ లు, సినీ ప్రకటనలు, ఆడియో ఫంక్షన్ లు ఇలా సినిమాలకు సంబంధించి ఎటువంటివి ప్రసారం లేకుండా చేయాలని భేటీలో కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ భేటీలో అగ్రహీరోలు అందరూ పాల్గొన్నారట.

అయితే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మాత్రం హాజరుకాలేదని తెలుస్తోంది. అయితే ఈ భేటీకి మెగా స్టార్ చిరంజీవి అధ్యక్షత వహించారట. అంతే కాదు ప్రస్తుతానికి ఇది తొలి మీటింగ్ అని, రానున్న కొద్దిరోజుల్లో మరొక మీటింగ్ ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వీరు తీసుకున్న నిర్ణయాలపై మా అసోసియేషన్ త్వరలో అధికారిక ప్రకటన విడుదలచేయనుందట…..