టీఆర్ఎస్ మెజారిటీ ఎంత? రెండో స్థానం ఎవరిది..?

Sunday, September 14th, 2014, 12:42:27 PM IST


మెదక్ ఉప ఎన్నిక ముగిసింది. ఏ పార్టీ భవితవ్యం ఏమిటో రెండు రోజుల్లో తేలనుంది.ఉప ఎన్నికల్లో సాధారణంగా గెలుపును అధికార పార్టీ స్వంతం చేసుకుంటుందని పరీశీలకులు చెబుతున్నా.. మూడు పార్టీల మధ్య జరిగిన పోరులో ఏపార్టీ ఎన్ని ఓట్లను సాధిస్తుందన్నదే ప్రయారిటిగా మారింది. దీంతో గతంలో సాధించిన ఓట్లను మళ్లీ నిలబెట్టుకుంటామా అనే ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఉప ఎన్నికలో విజయం కోసం అధికార పార్టీ.. సాధారణ ఎన్నికలకు దీటుగా తమ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసినా.. గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటి తగ్గకుండా ఆపార్టీ నేతలు ప్రయత్నాలు చేశారు.

అయితే బీజేపీ మాత్రం.. గెలుపుపై పెద్దగా ధీమాగా లేనప్పటికీ.. గులాబీ పార్టీకి వచ్చిన మెజారిటిని తగ్గించేందుకు బరిలోకి దిగినట్టు స్పష్టం చేశారు. ఈనేపథ్యంలోనే బలమైన అభ్యర్థి కోసమంటూ చివరి వరకు అభ్యర్థి ఎంపికపై కసరత్తును జరిపారు. మెజారిటి తగ్గించడంతో పాటు.. టార్గెట్ కాంగ్రెస్ గా ప్రయత్నాలు చేసింది. దీంతో సాధారణ ఎన్నికల్లో రెండవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టి.. ఆస్థానాన్ని తాము కైవసం చేసుకోవాలనే వ్యుహంతో ముందుకు వెళ్లింది. ఇందుకోసం తమ పాత మిత్రుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన జగ్గారెడ్డిని రంగంలోకి దింపింది. దీని వల్ల అటు అధికార పార్టీకి దీటైన అభ్యర్థితోపాటు, కాంగ్రెస్ బలం తగ్గించవచ్చనే పథక రచన చేసింది. దీనికితోడు టీడీపీ కూడ జగ్గారెడ్డికి మద్దతునివ్వడంతో బీజేపీ అంచనాలు పెరిగాయి..

ప్రధానంగా అధికార పార్టీకి మెజారిటిని తగ్గించడం వల్ల ఆపార్టీని నైతికంగా దెబ్బతీయడం తోపాటు కాంగ్రెస్ పార్టీని మరుగున పడేయాలనే ఉద్దేశ్యం కమలనాధుల్లో ఉంది. మరోవైపు ఈ ఎన్నిక గ్రామ స్థాయిలో పార్టీకి కోంత పట్టు సాధిస్తుందనే అంచనాలతో ఉన్నారు. దీంతో సంగారెడ్డితోపాటు పటాన్ చెరు, గజ్వేల్ నియోజవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థికంటే ఒక్క ఓటైనా మెజారిటీ తీసుకువచ్చే విధంగా పోరాడారు. ఇందుకోసం రెండు పార్టీలు తమ తమ స్థాయిలో కృషి చేశాయి. ఈనేపథ్యంలోనే ఎన్నికల ప్రచారం చివరిరోజున ఆయా నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులను సైతం ప్రచారంలోకి దింపారు.

అయితే కమలనాథులు ఆశించినట్టుగా ఫలితాలు వస్తాయా అనేది మీమాంసగా మారింది.. ఓటరు సరళిని బట్టి పార్టీ నేతలు అధికార పార్టీకి గెలుపు ఖాయంగా చెబుతున్నారు.. దీంతో రెండవ స్థానంలో ఉంటామని చెబుతున్నారు.. అయితే గతంతో పోల్చితే మొత్తం మీద ఓటింగ్ శాతం తగ్గడం పార్టీ నేతలకు కోంత ఇబ్బందిగా మారింది.ప్రధానంగా బీజేపీ, టీడీపీలకు పట్టున్న నియోజకవర్గమైన పఠాన్ చెరువులో ఓటింగ్ శాతం తగ్గడం పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది.. పటాన్ చెరు నియోజకవర్గంలోనే మూడున్నర లక్షల ఓటర్లు ఉన్నారు..ఈ నేపథ్యంలో అక్కడ యాబై శాతం వరకు ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది.. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి పట్టున్న నర్సాపూర్ లో ఎనబై శాతానికి పైగా పోలింగ్ జరగడం కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందా.. అనే అంచనాలో బీజేపీ నేతలు ఉన్నారు. దీంతో తాము ఆశించిన రెండవ స్థానం దక్కుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ అశించినట్టుగా గెలుపోటములు ఎలా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టడడంతోపాటు బీజేపీ గ్రామ స్థాయిలో పుంజుకుంటుందనే దీమాలో పార్టీ నేతలు ఉన్నారు. ఈ పరిణామం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆశించినట్టుగా 2019 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడుతోందనే పార్టీ నేతల అంచనాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

మెజారిటీ తగ్గుతుందా పెరుగుతుందా..?
మెదక్ లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీఆర్‌ఎస్ అభ్యర్థికి మూడు లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని అక్కడ కొందరు పందెం కాస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో కేసీఆర్‌కు 3.97 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే అప్పుడు 79 శాతం పోలింగ్ నమోదు కావటంతో అంత మెజార్టీ వచ్చింది. ఈ సారి 65 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడంతో మెజారీటి తగ్గడం ఖాయమని విశ్లేషకలు భావిస్తున్నారు. అయితే ఈ ఫలితాలు ఈ నెల 16న తేలబోతున్నాయి.