రానున్న రోజుల్లో టీడీపీ పరిస్థితి ఏంటి?

Sunday, June 2nd, 2019, 02:40:58 AM IST

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో జగన్ దెబ్బకు అక్కడ పోటీ చేసిన రెండు పార్టీలకు కోలుకోలేని దెబ్బ తగిలినంత పని అయ్యింది.జనసేన పార్టీ అధినేత పవన్ కు ఇది మొట్టమొదటి సారి పోటీ కావడంతో తర్వాత వారికి పెద్ద నష్టం ఏమి లేదు..కానీ తెలుగుదేశం పార్టీ యొక్క ఎన్నో ఏళ్ల ప్రతిష్ట ఈ ఒక్క ఎన్నికలతో పోయింది.అస్సలు టీడీపీ నాయకులు కలలో కూడా ఊహించని స్థాయి పరాజయాన్ని వారు చూడాల్సి వచ్చింది.దీనితో చాలా మంది నేతలు డీలా పడిపోయారు.ఇంకా ఏపీలో వారి భవిష్యత్తు కార్యాచరణ ఏమిటో ఇప్పటి నుంచే ప్రణాళిక వేసుకుంటే మంచిదని విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గడిచిన ఎన్నికల్లో వారు చేసిన తప్పులు పొరపాట్లు రానున్న రోజుల్లో చెయ్యకుండా ఉండడమే కాకుండా మళ్ళీ తమ ఓటర్లను వారి వైపు తిప్పుకునే ప్రయత్నం చెయ్యాలని ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీపై విధాన పరమైన విమర్శలను ఎత్తి చూపి ప్రజల్లో వ్యతిరేఖత తీసుకువస్తే మట్టుకు మళ్ళీ తెలుగుదేశం జెండా ఏపీ రాజకీయాల్లో ఎగుర వేసేందుకు అవకాశం ఉందని వారు అంటున్నారు.అలాగే మరో పక్క తెలుగుదేశం పార్టీలో నుంచే పగ్గాలు మారే అవకాశాలు కూడా ఉన్నాయని మరికొంత మంది విశ్లేషిస్తున్నారు.

పార్టీ పగ్గాలు మారడం అంటే మళ్ళీ పార్టీను ముందుండి నడపగలిగే సామర్ధ్యం ఉన్న వ్యక్తి కావాలి.దీనిపై చంద్రబాబు తన అనంతరం లోకేష్ కు ఇస్తారా లేక తారక్ కు ఇస్తారా అన్నది పెద్ద మిస్టరీగా మారింది.లోకేష్ విషయానికి వస్తే అతని కోసం అందరికీ తెలిసిందే.అలాగే తారక్ కూడా సినిమాలు వదిలి ఇటు వైపుగా రావడానికి చాలా సమయం పట్టుద్ది దీనితో ఎటు పోని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది.మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.