‘జయదేవు’డెక్కడ..?

Tuesday, September 23rd, 2014, 02:17:15 PM IST


గుంటూరు నగర ఎంపి గల్లా జయదేవ్ ప్రజలకు ఇచ్చిన మాట తప్పుతున్నాడని ప్రజలు వాపోతున్నారు. గుంటూరు ఎంపిగా తనను గెలిపిస్తే, తాను గుంటూరులోనే ఉండి.. ప్రజలకు సేవచేస్తానని చెప్పిన ఎంపి ఇప్పుడు అసలు నియోజక వర్గం ప్రజలను పట్టించుకోవడమే మానేశారని ప్రజలు మండిపడుతున్నారు. గుంటూరులోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటానని, స్థలపరిశీలన కోసం మూడు నెలలు గడువు కావాలని అడిగిన ఎంపి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో అర్ధంకావడంలేదు. వ్యాపారవేత్తలకు, సినిపరిశ్రమలో ఉన్న వారిని గెలిపిస్తే.. వారు అందుబాటులో ఉండరనేది వాస్తవం.. కాని తాను అందుకు భిన్నంగా ఉంటానని మాట ఇచ్చిన గల్లా జయదేవ్ ఇప్పుడు ఎప్పుడోగాని గుంటూరులో దర్శనం ఇవ్వడం లేదు.

ఎంపీ కార్యాలయానికి వెళ్తే, అక్కడి సిబ్బంది సైతం సరైనా సమాధానం ఇవ్వడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఎన్నికలకు ముందు, స్థానిక ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్ధిని, విద్యార్ధులతోటి గల్లా జయదేవ్ సమావేశం జరిపారు. జయదేవ్ మాటలను బట్టి, ఇక వారు ఉపాది అవకాశాల కోసం ఎక్కడికో వెళ్ళే అవసరం లేదని అనుకున్నారు.. గెలిచాక, పరిశ్రమల స్థాపన అలాఉంచితే.. కనీసం దర్శనంమే కరువైంది.

పెద్దపెద్ద కార్లు వేసుకోచ్చే బడా నాయకులకే గాని, సాధారణ ప్రజలకు దర్శనం ఇవ్వరేమో ఈ జయదేవుడని గుంటూరు ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు ఢిల్లీలో ఉన్న జయదేవ్ ఆతరువాత నియోజకవర్గప్రజలకు అందుబాటులో ఉంటారని భావించారు.. కానీ, జయదేవ్ గుంటూరు ప్రజలకే కాదు.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

శనివారం విజయవాడలో జరిగిన ఎంపిల సమావేశంలో పాల్గొంన్న జయదేవ్ ఆదివారం గుంటూరుకు వచ్చి చడీచప్పుడు కాకుండా వెళ్ళిపోయారు. ప్రజలు, కార్యకర్తలు తమకున్న సమస్యలు విన్నవించేందుకు.. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగులనో లేక నరసరావు పేట ఎంపి రాయపాటినో కలిసి తమ గోడు చెప్పుకొని వెళ్తున్నారు. పైనున్న దేవుడు కనిపించడు.. ఓట్లేసి గెలిపించిన జయదేవుడు కనిపించడని గుంటూరు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.