`రంగ‌స్థ‌లం` రికార్డులు కొట్టే చాన్సెవ‌రికి?

Monday, April 2nd, 2018, 11:18:39 PM IST


చ‌ర‌ణ్ `రంగ‌స్థ‌లం` స్పీడ్ చూస్తుంటే, తొలి వారంలోనే100 కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ సినిమా 120 కోట్ల వ‌సూళ్లు అందుకుని బ్లాక్‌బ‌స్ట‌ర్ ఖాతాలో చేరుతుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది. అటు ఓవ‌ర్సీస్ నుంచే 20 కోట్లు వ‌సూలు చేస్తే, ఇటు తెలుగు రాష్ట్రాల నుంచే ఏకంగా 100 కోట్లు క‌లెక్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

అయితే ఈ స్థాయి వ‌సూళ్లు సాధించి, రంగ‌స్థ‌లం రికార్డులు కొట్టే సత్తా మునుముందు రిలీజ్‌కి వ‌స్తున్న ఏ సినిమాల‌కు ఉంది? అంటే ఓ మూడు సినిమాల‌కు ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `భ‌ర‌త్ అనే నేను` జ‌నాల‌కు క‌నెక్ట‌యితే స‌రికొత్త రికార్డులు సృష్టించే అవ‌కాశం ఉంది. ఈ సినిమా అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఏప్రిల్ 20న రిలీజ‌వుతోంది. అటుపై మే 4న వ‌స్తున్న అల్లు అర్జున్ `నా పేరు సూర్య‌` బ్లాక్‌బ‌స్ట‌ర్ అన్న టాక్ తెచ్చుకుంటే, రికార్డులు న‌మోదు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఇటీవ‌ల బ‌న్నీకి పెరిగిన ఇమేజ్‌, అలాగే బ‌హుభాష‌ల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నందున ఈ సినిమా నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో అన్ని రికార్డుల్ని స‌వ‌రించేందుకు ఆస్కారం ఉంది. ఇక ర‌జ‌నీకాంత్ న‌టించిన `కాలా`ని త‌క్కువ అంచ‌నా వేయ‌లేం. సూప‌ర్‌స్టార్ హ‌వా న‌డిస్తే, కాలా- క‌రికేయ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద ఓ ఊపు ఊపుతుంది. ఈ సినిమా బ‌న్ని,మ‌హేష్ మ‌ధ్య‌లో అంటే ఏప్రిల్ 27న‌ వ‌స్తోంది. ఇక నితిన్ ఛ‌ల్ మోహ‌న్ రంగ‌- ఏప్రిల్ 5న‌, `కృష్ణార్జున యుద్ధం` – ఏప్రిల్ 12న, `మ‌హాన‌టి`- మే9న‌, మెహ‌బూబా` – మే 11న వ‌స్తున్న వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇవ‌న్నీ మంచి వ‌సూళ్లు ద‌క్కించుకుంటాయ‌న్న అంచ‌నాలున్నాయి. ఓవ‌ర్సీస్‌లో నితిన్‌, నానీల‌కు బోలెడంత సీను ఉన్న సంగ‌తి తెలిసిందే.