తెలంగాణ అసెంబ్లీలో ప్ర‌తి ప‌క్ష హోదా ఎవ‌రికి?

Sunday, June 9th, 2019, 10:45:06 PM IST

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు నుంచి మొద‌లైన రాజ‌కీయం ఇంకా వేడి త‌గ్గ‌డం లేదు. ఇటీవ‌ల సార్వత్రిక ఎన్నిక‌లు పూర్త‌యినా అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య రాజకీయం రంజుగా సాగుతోంది. తెరాస దెబ్బ‌కు శాస‌న స‌భ ఎన్నిక‌ల నుంచి సార్వ‌త్రిక ఎన్నిక‌ల వ‌ర‌కు కోలుకోలేని దెబ్బ‌తిన్న కాంగ్రెస్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ చేతులెత్తేసింది. ఇక ఇదే అద‌నుగా అధికార తెరాస కాంగ్రెస్‌కు అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదాని కూడా లేకుండా చేసింది. ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేల‌తో సీఎల్పీ విలీన నోటీసుల‌ని స్వ‌యంగా స్పీక‌ర్‌కి ఇప్పించి నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య సీఎల్పీని తెరాస‌లో విలీనం చేసేసుకుంది. దీంతో అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదా కోల్పోవ‌డంతో గ‌గ్గోలు పెడుతున్న కాంగ్రెస్ నాయ‌కులు తెరాస‌లో సీఎల్పీ విలీనం అన్యాయ‌మ‌ని అరుస్తూ బ‌ట్టి విక్ర‌మార్క నిర‌స‌న దీక్ష‌కు దిగారు.

ఇక అసెంబ్లీలో ప్రధాన ప్ర‌తిప‌క్షం లేక‌పోవ‌డంతో ఆ స్థానంలో మిత్ర ప‌క్షమైన ఎంఐఎం ఆ హోదా త‌మ‌కే కావాలంటూ బాహాటంగానే వాద‌న‌లు వినిపిస్తోంది. దీనికి తెరాస కూడా వంత‌పాడుతుండ‌టంతో బీజేపీ రంగంలోకి దిగుతోంది. ఈ అంశాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకుని హందుత్వ వాదుల‌ను తెరాస‌కు దూరం చేయాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌జ్లీస్ పార్టీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌డానికి తెరాస అధినేత సుముఖంగా వున్నారు. ఇదే అంశాన్ని అడ్డుపెడ్డుకుని తెలంగాణ‌లో హిందూత్వ నినాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణ‌లో పాగా వేయాల‌ని చూస్తోంది. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో కేసీఆర్ హిందూత్వ‌పై గంట్ స్విప్ప‌యిన విష‌యం తెలిసిందే. దీనికి బీజేపీ ఎంపీల రూపంలో మూల్యం చెల్లించుకున్నారు. మ‌జ్లీస్‌కు ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెరాస అధికారం వ‌దులుకోవ‌డం ఖాయమే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.