ట్రంప్ తల్లితండ్రుల గురించి తెలుసా..? తెలియకపొతే ఇది చదవండి

Saturday, January 21st, 2017, 11:55:08 PM IST

Donald-Trump-says-Brexit-a-
ట్రంప్ తల్లితండ్రులు పేర్లు ఫెడ్రిక్ ట్రంప్, మేరీ. స్కాట్లాండ్ లోని లెవిస్ దీవి మేరీ స్వస్థలం. ఈ దీవిలోని టాంగ్ అనే పట్టణంలో 1912లో మేరీ జన్మించింది. మేరీ తండ్రి మాల్కమ్ ఒక తపాలా కార్యాలయాన్ని, ఒక చిన్న దుకాణాన్ని నిర్వహించేవాడు. ఆయనది మధ్యతరగతి కుటుంబం. మాల్కమ్ కు పది మంది సంతానం. వారిలో అందరికంటే మేరీ చిన్నది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో లెవిస్ దీవికి తీవ్ర నష్టం కలిగింది. యుద్ధం తరువాత అక్కడ ఆర్ధిక సంక్షోభం మొదలైంది. దీంతో అక్కడి యువత ఉపాధి నిమిత్తం వలస బాట పట్టారు. 1930లో మేరీ తన 18 ఏళ్ల వయసులో అమెరికాకు వలస వెళ్ళింది.

న్యూయార్క్ శివారులోని ఒక ధనికుల ఇంటిలో పిల్లలకు సంరక్షకురాలిగా ఉద్యోగం చేసింది. ఆమెకు ఆ ఉద్యోగం ఎక్కువ కాలం నిలువలేదు. ‘వాల్ స్ట్రీట్’ నష్టాల్లో కూరుకుపోవడంతో మేరీ ఉద్యోగం కూడా ఊడిపోయింది. 1934లో ఆమె స్కాట్లాండ్ తిరిగి వెళ్ళిపోయింది. అయితే అప్పటికే ఆమెకు న్యూయార్క్ లో ప్రముఖ స్థిరాస్తి వ్యాపారి ఫెడ్రిక్ ట్రంప్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. జర్మన్ వలసదారుల సంతానమైన ఫెడ్రిక్ నగరంలో అత్యంత విజయవంతమైన వ్యాపారుల్లో ఒకరుగా గుర్తింపు సంపాదించారు. మేరీ మళ్ళీ స్కాట్లాండ్ నుండి న్యూయార్క్ తిరిగి వహ్చి ఫెడ్రిక్ ను పెళ్లాడింది. 1942లో మేరీ అమెరికా పౌరసత్వాన్ని సంపాదించింది. ఈ దంపతులకు నాలుగవ సంతానంగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జన్మించాడు. ట్రంప్ కు వరుసకు సోదరులయ్యే ముగ్గురు ఇప్పటికే లెవిస్ దీవిలో ఉన్నారు. మేరీ 2000 సంవత్సరంలో చనిపోయారు. మేరీ నివసించిన ఇంటిని తరువాత పునర్నిర్మించారు. 2008లో ట్రంప్ ఆ ఇంటిని సందర్శించారు.