మ్యాస్ట్రోకి టాలీవుడ్‌పై ఎందుకంత‌ విర‌క్తి!

Monday, July 23rd, 2018, 01:10:59 PM IST

మ్యూజిక్ మ్యాస్ట్రో ఏ.ఆర్‌.రెహ‌మాన్ వైఖ‌రి ప‌రిశీలిస్తే నిర్ఘాంత‌పోయే విష‌యాలెన్నో అర్థ‌మ‌వుతాయి. అత‌డు తొలి నుంచి తెలుగు సినిమాకి విముఖుడిగానే ఉన్నారు. త‌మిళంలో, లేక‌పోతే బాలీవుడ్ లో ఇంకా ఛాన్సుంటే హాలీవుడ్‌కి వెళ్లిపోయేందుకు ఉత్సాహం చూపించాడు కానీ, ఏనాడూ తెలుగు సినిమాకి ప‌ని చేయాల‌న్న ఆస‌క్తి చూపించ‌లేదు. అయితే అందుకు స‌వాల‌క్ష కార‌ణాలు. మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, హీరోల‌తో అత‌డు సింక్ అవ్వ‌క‌పోవ‌డం ఒక కార‌ణ‌మైతే, రెహ‌మాన్ తాను ఏం చేయాల‌నుకున్నా ఎక్కువ స‌మ‌యం తీసుకుంటాడ‌న్న అప‌ప్ర‌ద కూడా వేరొక కార‌ణం కావొచ్చు. అయితేనేం అత‌డు అప్ప‌ట్లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం, ఎస్‌.జె సూర్య కోసం కొమ‌రం పులి చిత్రానికి ప‌ని చేశాడు. చాలా కాలానికి మెగాస్టార్ చిరంజీవి- సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాకి సంత‌కం చేశాడ‌న‌గానే మెగాభిమానులు సంబ‌రాలు చేసుకున్నారు. అయితే ఆ సంబ‌రాల్ని నీరుగారుస్తూ రెహ‌మాన్ ఈ ప్రాజెక్టుకు ప‌ని చేయ‌లేద‌న్న వార్త నీర‌స‌ప‌డిపోయేలా చేసింది.

ఇప్పుడు అత‌డిని ఒప్పించేందుకు బ‌న్ని ద‌ర్శ‌కుడు విక్ర‌మ్‌.కె.కుమార్ ప్ర‌య‌త్నిస్తున్నాడు అన‌గానే ఎవ‌రికీ ఓప‌ట్టాన న‌మ్మ‌కం క‌ల‌గ‌డం లేదు. రెహ‌మాన్‌ని ఒప్పించ‌డం అంత సులువేం కాదు. అయితే విక్ర‌మ్‌.కెకి అంత స‌త్తా ఉంది. 2016లో రిలీజైన‌ 24 సినిమాకి రెహ‌మాన్ ప‌ని చేశారు. ఆ సాన్నిహిత్యం, విక్ర‌మ్ ప‌నిత‌నంపై న‌మ్మ‌కంతో ఇప్పుడు బ‌న్ని సినిమాకి అంగీక‌రిస్తాడ‌ని అభిమానులు న‌మ్ముతున్నారు. అయితే రెహ‌మాన్ ఈ ఒక్క‌సారికి అయినా నిరాశ‌ప‌ర‌చ‌కుండా అంగీక‌రిస్తాడా? రెహ‌మాన్ అంటే చెవి కోసుకునే తెలుగు వీరాభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్న త‌రుణ‌మిది. ఇక‌పోతే త‌మిళంలో ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ కోసం అదిరిపోయే బాణీలు స‌మ‌కూరుస్తున్నాడు రెహమాన్‌. విజ‌య్ – మురుగ‌దాస్‌ల `స‌ర్కార్` మ్యూజిక్ ట్రెండ్ సెట్టింగ్ అవ్వ‌డం ఖాయ‌మ‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. సెప్టెంబ‌ర్‌లో ఆడియో ఈవెంట్‌లో రెహ‌మాన్ నేరుగా లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వ‌నున్నార‌న్న వార్త‌తో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక‌పోతే ఆ త‌ర్వాత త‌ప్ప‌నిస‌రిగా బ‌న్ని కోసం వ‌స్తాడా? లేదా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్‌. రెహ‌మాన్ రావాల‌నే స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments