మెగా నిర్మాత‌కు మెగా హ్యాండు?

Saturday, September 15th, 2018, 12:20:01 PM IST

నాలుగు ద‌శాబ్ధాల చ‌రిత్ర ఉన్న వైజ‌యంతి మూవీస్ అధినేత‌గా అశ్వ‌నిద‌త్ ప్ర‌స్థానం గురించి మాట్లాడాల్సి వ‌స్తే తొలిగా మెగాస్టార్ చిరంజీవితో ఆ కాంపౌండ్‌తో స‌త్సంబంధాల గురించి మాట్లాడాలి. చిరు అంటే ద‌త్‌కి, ద‌త్ అంటే చిరుకి ఎంతో అభిమానం, గౌర‌వం. ఎంతో గొప్ప అనుబంధం ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఉంది. చిరంజీవి క‌థానాయ‌కుడిగా అశ్వ‌నిద‌త్ ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని నిర్మించారు. ఈ కాంబినేష‌న్‌లో `జ‌గ‌దేక వీరుడు-అతిలోక సుంద‌రి` ఎంత‌టి సంచ‌ల‌న‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు. అయితే కాల‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవితో తిరిగి సినిమాలు చేయాల‌ని ప్ర‌య‌త్నించినా ద‌త్ ఎందుకో తీయ‌లేకపోయారు. క‌నీసం ఆ కాంపౌండ్ హీరోల‌తో కూడా సినిమాలు తీయ‌లేక‌పోవ‌డం యాధృచ్ఛికం.

ఆ క్ర‌మంలోనే ఇటీవ‌లే చిరు- ప‌వ‌న్ ఇద్ద‌రినీ క‌లిపి ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్‌ని నిర్మించేందుకు ద‌త్‌ ప్లాన్ చేశారు. అందుకు క‌ళాబంధు టీఎస్సార్ స‌మ‌క్షంలో పెద్ద ప్లాన్‌నే వేశారు కానీ, అదేమంత వ‌ర్క‌వుట్ కాలేదు. చిరు, ప‌వ‌న్ ఇద్ద‌రూ రాజ‌కీయాల‌తో బిజీ అయిపోవ‌డం అత‌డి ఆలోచ‌న‌కు పెద్ద చెక్ పెట్టేసింది. ఆ క్ర‌మంలోనే మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా `జ‌గ‌దేకవీరుడు-అతిలోక సుంద‌రి 2` తెర‌కెక్కించాల‌ని ద‌త్ ప్ర‌య‌త్నించారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ నుంచి అతిలోక సుంద‌రి కుమార్తె జాన్వీని బ‌రిలో దించాల‌ని ప్లాన్ వేశారు. కానీ ఏదీ అంత సులువుగా వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. ప్లాన్ బావుంది.. కానీ స‌న్నివేశమే అనుకూలించ‌డం లేదు. ఇక‌పోతే ఆ రెండూ ఇంకా పెండింగ్ ప్రాజెక్టులుగానే మిగిలిపోయాయి.

మ‌రోవైపు రామ్‌చ‌ర‌ణ్ హీరోగా, నిర్మాత‌గా రెండు ప‌డ‌వ‌ల ప‌య‌నం చేయ‌డం కూడా ద‌త్ వంటి వారికి అనుకూలించ‌డం లేదు. ఇక చ‌ర‌ణ్ సొంత బ్యాన‌ర్ కొణిదెల కాంపౌండ్‌లోనే సినిమాలు చేస్తుండ‌డం వ‌ల్ల .. మామ‌ అల్లు అర‌వింద్ వంటి వారికే ఛాన్స్ ఇవ్వ‌డం లేదు. ఇక‌పోతే ద‌త్ తో సినిమా చేసే ఆలోచ‌న ఉన్నా ఇప్ప‌ట్లో అది కుదిరేప‌ని కాద‌ని అర్థ‌మ‌వుతోంది. ఆ క్ర‌మంలోనే అశ్వ‌నిద‌త్ దేవ‌దాస్, మ‌హ‌ర్షి వంటి చిత్రాల‌తో బిజీ అయిపోయారు. ఆ రెండు సినిమాలు తొంద‌ర్లోనే రిలీజ్‌కి రానున్నాయి. అయితే ద‌త్ మెగా ప్లాన్స్ ఎప్ప‌టికి వ‌ర్క‌వుట్ అవుతాయోన‌న్న ఆస‌క్తిక‌ర చ‌ర్చా సాగుతోంది. ఇటీవ‌లే ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, మ‌హాన‌టి చిత్రాల‌తో ద‌త్ కాంపౌండ్ బౌన్స్ బ్యాక్ అయ్యింది. మ‌రి మునుముందు మెగా లెవ‌ల్లో సినిమాలెప్పుడో వేచి చూడాల్సిందే. నేడు ద‌త్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నేటిఏపీ శుభాకాంక్ష‌లు.

  •  
  •  
  •  
  •  

Comments