ఎన్టీఆర్ ‘భారతరత్న’ మర్మమేమిటో?

Wednesday, September 17th, 2014, 04:27:27 PM IST


దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ,వెండితెర వేల్పు అయిన నందమూరి తారక రామారావు పేరును ప్రతిష్టాత్మకమైన ‘భారతరత్న’ పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించక పోవడాన్ని నిరసిస్తూ ఆయన సతీమణి లక్ష్మీపార్వతి ఎన్టిఆర్ ఘాట్ వద్ద ధర్నాకు దిగారు. కాగా ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవానికి ఇచ్చే ‘పద్మ’ అవార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు సమాజానికి వివిధ రంగాలలో సేవలు అందించిన వారి పేర్లను సిఫార్సు చెయ్యడం రివాజు.

అయితే ఈ సారి కూడా పద్మ అవార్డుల కోసం కొంతమంది ప్రముఖుల పేర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ పంపింది. కాగా అందులో భారతరత్న పురస్కారానికి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు సిఫార్సు చేస్తుందని అందరూ అభిప్రాయపడ్డారు. అయితే కేంద్రానికి పంపిన లేఖలో చంద్రబాబు ఆ ప్రస్తావన తేవకపోవడంతో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి రాష్ట్ర ప్రభుత్వం చర్యను నిరసిస్తూ ధర్నాకు దిగారు. ఇక గతంలో కూడా ఎన్టిఆర్ కు ఎన్డియే ప్రభుత్వ హయాంలో భారతరత్న ఇచ్చే అవకాశం ఉన్నా చంద్రాబాబు అడ్డుపుల్ల వేశారనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.