మ‌ర్చిపోయిన నాట‌కాల్ని గుర్తు చేసిన సినిమావోళ్లు!

Saturday, February 3rd, 2018, 12:04:22 PM IST

ఒక‌ప్పుడు నాట‌కం అంటే దాని విశిష్ట‌తే వేరుగా ఉండేది. నాట‌కాలు ఆడేవాళ్లు అస‌లైన స్టార్లు. పండ‌గ‌లు-ప‌బ్బాల వేళ విలేజీల్లో వీధినాట‌కాలు ప్ర‌సిద్ధిగాంచేవి. అయితే కాల‌క్ర‌మంలో బుల్లితెర సీరియ‌ళ్లు, పెద్ద తెర సినిమాలు ఎక్కువ కావ‌డంతో జ‌నం డ్రామాలు చూడ‌డం మానేశారు. అస‌లు నాట‌కాలాడేవాళ్లే క‌రువ‌య్యారు. ఇంకా సుర‌భి వంటి నాట‌క‌ప్ర‌క్రియ‌.. నాట‌కాలు ప్ర‌ద‌ర్శించే ఆర్టిస్టులు ఉన్నారు కాబ‌ట్టి అప్పుడ‌ప్పుడు ఆ మాటైనా వినిపిస్తోంది. విదేశాల్లో నాట‌క రంగం అంత‌కంత‌కు పెరుగుతుంటే, మ‌న దేశంలో మాత్రం అంత‌రించిపోతోంద‌ని ప‌లువురు నాట‌క‌క‌ర్త‌లు, సీరియ‌ర్ ఆర్టిస్టులు బ‌హిరంగ వేదిక‌ల‌పై వాపోవ‌డం రివాజు.

అయితే నాట‌క రంగం అనేది ఒక‌టి ఉంద‌ని గుర్తు చేసేందుకా అన్న‌ట్టు మూవీ ఆర్టిస్టుల సంఘం `మా` నాట‌కోత్స‌వాలు నిర్వ‌హించ‌డం ఫిలింన‌గ‌ర్‌లో చ‌ర్చ‌కొచ్చింది. కీ.శే. డా.డి. రామానాయుడు గారి వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని ఈనెల 16,17,18 తేదీల‌లో సాయంత్రం 6.30 ని..ల‌కు ఫిలిం న‌గ‌ర్ రామానాయుడు క‌ళామండ‌పంలో ఈ ఉత్స‌వాలు సాగుతాయ‌ని ప్ర‌క‌టించడం సంచ‌ల‌న‌మైంది. తొలి నాళ్ల‌లో సినీ ప‌రిశ్ర‌మ వేళ్లూనుకూంటున్న త‌రుణంలో ఎంద‌రో మ‌హాన‌టులు, సాంకేతిక నిపుణులు నాట‌క‌రంగం నుంచి వ‌చ్చిన వాళ్లే. సినీ ప‌రిశ్ర‌మ‌కు నాట‌క‌రంగం త‌ల్లిలాంటింది. అలాంటి నాట‌క‌రంగంపై ప్రేమ‌తో, అభిమానంతో కృత‌జ్ఞ‌త‌గా..ఈ నాట‌కాలు 3 రోజుల పాటు నిర్వ‌హిస్తున్నామ‌ని, సినీ పరిశ్ర‌మ‌లోని ప్ర‌ముఖులంద‌రూ ఈ ఉత్స‌వాల్లో పాల్గొంటార‌ని ఈ సంద‌ర్భంగా `మా` అధ్య‌క్షులు శివాజీ రాజా తెలిపారు. అయితే మ‌ర్చిపోయిన నాట‌కాల్ని గుర్తు చేసిన ఈ సినిమావోళ్ల గొప్ప‌త‌నాన్ని పొగ‌డాల్సిందే.