కెసిఆర్ ను గుణశేఖర్ ఎందుకు కలిశారు?

Tuesday, October 7th, 2014, 12:48:48 PM IST


తెలంగాణ చరిత్రలో కాకతీయ రాజులకు ప్రముఖ స్థానం ఉన్న విషయం తెలిసిందే. అందులోను మరీ ముఖ్యంగా రాణి రుద్రమదేవి.. ఆమె ప్రతిభా పాటవాల గురించి ఎన్నో పాఠ్యపుస్తకాలలో చదివాం. ధారావాహికలుగా చూశాం. కాని, ఇప్పుడు రాణి రుద్రమదేవి కధ ఆధారంగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ సినిమాగా నిర్మిస్తున్నారు. భారీ తారాగణంతో.. భారీ సెట్టింగులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క రాణి రుద్రమదేవి పాత్రను పోషిస్తున్నది.

కెసిఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తరువాత, తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలు, తెలంగాణ చరిత్రకు పెద్ద పీట వేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా.. హైదరాబాద్ నగరంలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికోసం.. ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు గతంలో కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రకు అద్దం పట్టే విధంగా రోపొందిస్తున్న రాణి రుద్రమదేవి సినిమాకు టాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ.. దర్శకుడు గుణశేఖర్ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసినట్టు తెలుస్తున్నది. గుణశేఖర్ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.