`టిక్ టిక్ టిక్` వాయిదాకి కార‌ణం?

Friday, April 13th, 2018, 12:15:27 AM IST

విల‌క్ష‌ణ సినిమాల‌తో గ్రేట్ విక్ట‌రీ అందుకుంటున్న జ‌యం ర‌వి క‌థానాయ‌కుడిగా శ‌క్తి సౌంద‌ర‌రాజ‌న్ ద‌ర్శ‌కత్వంలో `టిక్ టిక్ టిక్‌` చిత్రాన్ని ప్రారంభించారు. ఇదో విల‌క్ష‌ణ‌మైన‌ అంత‌రిక్షం బ్యాక్‌డ్రాప్ మూవీ. స్పేస్ ఒడిస్సీ, గ్రావిటీ వంటి గ్రేట్ హాలీవుడ్ మూవీస్ స్ఫూర్తితో మ‌న‌దైన నేటివిటీతో తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిద‌ని ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన ట్రైల‌ర్ వెల్ల‌డించింది. ఈ చిత్రాన్ని శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ ఫిలింస్ ప‌తాకంపై చ‌ద‌ల‌వాడ పద్మావ‌తి తెలుగువారికి అందిస్తున్నారు. అయితే ఏమైందో ఈ సినిమా రిలీజ్ తేదీ ప‌లుమార్లు వాయిదా ప‌డింది. రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 26న రిలీజ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. కానీ అప్ప‌టికి వాయిదా ప‌డి, ఏప్రిల్ 12న రిలీజ్ చేస్తామ‌ని కొత్త తేదీని వెల్ల‌డించారు. ఈరోజు కూడా ఈ సినిమా రిలీజ్ కాలేదు. హ్యాష్‌ట్యాగ్ `టిక్ టిక్ టిక్‌` ట్విట్ట‌ర్ ప‌రిశీలిస్తే, ఈ సినిమా కొద్ది పాటి ఆర్థిక‌ప‌ర‌మైన చిక్కుల్లో ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. నిర్మాత వి.హితేష్ జ‌బ‌క్ ఎమోష‌న్ ట్విట్ట‌ర్‌లో క‌నిపించింది. కార్తీక్ అనే ఓ నెటిజ‌న్ వేసిన సెటైర్‌కి నిర్మాత హితేష్ ఎంతో ఆవేద‌న‌గానూ స్పందించారు.

“ర‌క్తం, చెమ‌ట చిందించి ఈ సినిమా తీస్తున్నాం. `సైలెంట్‌` మూవీ అని కామెంట్ చేశావ్‌. ఇప్ప‌టికే రెండు మూడు సార్లు ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు ఎదుర్కొన్న‌ది నిజ‌మే. ఇలాంటి వేళ నీవంటి వారు నిర్మాత‌ల‌కు అండ‌గా నిల‌వాలి. సినిమా అనేది డ‌బ్బు పెడితే తీయ‌గ‌లం. ఇక్క‌డ నీళ్లు, గాలి పెట్టుబ‌డి కాదు!“ అంటూ సీరియ‌స్‌గానే స్పందించారు. అయితే ఈ వాయిదాకి ఆర్థిక కార‌ణాలే కార‌ణ‌మా? లేక ఇంకేదైనానా? అన్న‌ది తెలియాల్సి ఉందింకా. ప్ర‌ఖ్యాత సోని మ్యూజిక్ సంస్థ ఈ సినిమా రాక కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నామ‌ని అధికారిక ట్విట్ట‌ర్లో పేర్కొన‌డం విశేషం.

  •  
  •  
  •  
  •  

Comments