సంక్రాంతి పోరులో సూర్య షూర్ షాట్ విజేత అవుతాడా !

Thursday, January 11th, 2018, 03:50:01 PM IST

తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో సంక్రాంతి ఒకటి. ప్రతి తెలుగు ఇంటి లోగిలిలో రంగు రంగుల ముగ్గులతో, రకరకాల పిండివంటలతో, ఎంతో ఆనందంగా ఈ పండుగ చేసుకుంటారు. అంతే కాక ముఖ్యంగా ఈ పండుగకి విడుదలయ్యే చిత్రాలకి కూడా యమా క్రేజ్ ఉంటుంది. అందుకే సంక్రాంతికి తెలుగు సినిమాలు భారీగా విడుదల అవుతుంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన తొలి చిత్రం పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి డివైడ్ టాక్ తో రన్ అవుతోంది. నిన్ననే విడుదలయింది కాబట్టి ఇంకొద్ది రోజులు గడిస్తేగాని దాని పూర్తి ఫలితాన్నిచెప్పలేం. రేపు విడుదల కానున్న సూర్య గ్యాంగ్, బాలకృష్ణ జై సింహ చిత్రాల పైనే అందరి చూపు వుంది. యూవీ క్రియేషన్స్ సంస్థ అధినేతలు వంశి, ప్రమోద్ లు సూర్య ‘గ్యాంగ్’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇదివరకు యూవీ వారు శర్వానంద్ తో తీసిన ఎక్స్ ప్రెస్ రాజా సినిమా బాలయ్య, యన్ టి ఆర్ , నాగార్జున వంటి హీరోల చిత్రాలను తట్టుకుని మంచి విజయం అందుకుంది.

అదే విధంగా ఇటీవల విడుదలయిన యూవీ వారి మహానుభావుడు కూడా మహేష్, యన్ టి ఆర్ ల చిత్రాలను దాటుకుని మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే నమ్మకంతో వున్న యూవీ సంస్థ వారు, ఒక పక్క ఈ నెల 26 న విడుదలకు సిద్దముగా వున్న భాగమతి చిత్ర ప్రమోషన్ చేస్తూ, అలాగే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో సాహూ వంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తూ, తమిళ నాట పెద్ద స్టార్ అయిన సూర్య కి తెలుగులో వున్న మంచి మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ ని దృష్టి లో పెట్టుకుని పండుగ కానుకగా విడుదల చేస్తున్నారు. మంచి అభిరుచి కల తెలుగు ప్రేక్షకులు కధా, కథనం బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారని నిర్మాతలు అంటున్నారు. బాలయ్య లాంటి మాస్ స్టార్ సినిమా తో పాటు, రాజ్ తరుణ్ నూతన చిత్రం ‘రంగుల రాట్నం’ కూడా రేపు రిలీజ్ కానుంది . చూద్దాం ఈ పోటీలో సూర్య గ్యాంగ్ చిత్రం ఏ మేర విజయం అందుకుంటుందో.