టీ-సినిమాకి ఝ‌ల‌క్‌? వైజాగ్ టాలీవుడ్.. న్యూ గేమ్ ప్లాన్‌?

Monday, December 4th, 2017, 02:52:03 PM IST

హైద‌రాబాద్ సినీప‌రిశ్ర‌మ‌కు ధీటుగా వైజాగ్ ఫిలింఇండ‌స్ట్రీ అభివృద్ధికి స‌న్నాహాలు సాగుతున్నాయా? అంటే అవున‌నే స‌మాచారం. టీ-సినిమాకి ఝ‌ల‌క్ ఇచ్చే రేంజులో.. వైజాగ్ టాలీవుడ్ .. న్యూ గేమ్ ఛేంజ‌ర్ కాబోతోంద‌న్న‌ది సినీవిశ్లేష‌కులు చెబుతున్న మాట‌. ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ సోర్స్ ప్ర‌కారం.. ఓవైపు హైద‌రాబాద్ కేంద్రంగా ప‌రిశ్ర‌మ‌ను ర‌న్ చేస్తూనే, మ‌రోవైపు బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో సినీప‌రిశ్ర‌మ‌ను అభివృద్ధి చేసేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు నుంచి అన్ని ర‌కాల అనుమ‌తులు ల‌భించాయ‌ని, ఆ మేర‌కు ప‌లువురు సినీపెద్ద‌లు కొత్త ప‌రిశ్ర‌మ ఏర్పాటున‌కు రంగం సిద్ధం చేస్తున్నార‌ని తెలుస్తోంది. పైపైన ఎన్ని చెబుతున్నా, ఇక్క‌డో మాట అక్క‌డో మాట ప‌రిశ్ర‌మ పెద్ద‌లు చెబుతున్న తీరును బ‌ట్టి ఇక కొత్త ప‌రిశ్రమను నిలువ‌రించే ఆస్కారం లేద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు అందుకు సంబంధించిన సీరియ‌స్ ప్ర‌య‌త్నాల్లోనే ఉన్నారు. ఇదివ‌ర‌కూ విశాఖ బీచ్ ప‌రిస‌రాల్లో కాపులుప్పాడ ఏరియాలో .. రామానాయుడు స్టూడియోస్‌కి, మ‌ధుర‌వాడ ఐటీహ‌బ్ కి అత్యంత‌ స‌మీపంలో 15 ఎక‌రాల భూమిని సినీప‌రిశ్ర‌మ‌కు కేటాయిస్తూ ప్ర‌భుత్వం జీవోను జారీ చేసింది. ఓవైపు బీచ్‌, మ‌రోవైపు ప‌చ్చ‌ని కొండ‌ల మ‌ధ్య కొత్త ప‌రిశ్ర‌మ‌ను అభివృద్ధి చేసేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఏపీ ఫిలింఛాంబ‌ర్ ఏర్పాటున‌కు పునాది రాయి కూడా వేశారు. మొన్న నంది పుర‌స్కారాల ప్ర‌క‌ట‌న వేదిక‌గా సీఎం చంద్ర‌బాబును క‌లిసిన సినీపెద్ద‌లుకు సీఎం నుంచి పూర్తి స్థాయిలో హామీ ల‌భించింది. తొలుత సినీప‌రిశ్ర‌మ‌ను రాజ‌ధాని న‌గ‌రం అయిన అమ‌రావ‌తిలో ఏర్పాటు చేస్తే బావుంటుంద‌ని భావించినా, దానికంటే విశాఖ న‌గ‌రం అనుకూలంగా ఉంటుంద‌ని సినీపెద్ద‌లు అభిప్రాయ ప‌డ్డారు. అలానే నారా చంద్ర‌బాబు నాయుడు అందుకు సుముఖంగానే ఉన్నారని తెలిసింది. ఉత్త‌రాంధ్ర నాలుగు జిల్లాల సినీఔత్సాహికుల‌కు ఇది ఉత్సాహం నింపే వార్త అని చెబుతున్నారు.

ఇక కొత్త సినీప‌రిశ్ర‌మలో తదుప‌రి అంకం మొద‌లైంది. సినిమా కార్య‌క‌లాపాల‌కు సంబంధించిన అత్యంత కీల‌క‌మైన
వైజాగ్ ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ ను నేడు సినీపెద్ద‌లు ప్రారంభించారు. సీనియ‌ర్ నిర్మాత కె.ఎస్‌.రామారావు, ద‌క్షిణభార‌త చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ ఫిలింఛాంబ‌ర్ అధ్య‌క్షులు సి.క‌ళ్యాణ్, న‌ట‌శిక్ష‌కుడు స‌త్యానంద్‌, నిర్మాత-ఇండ‌స్ట్రియ‌లిస్ట్‌ కె.అశోక్‌కుమార్‌ ప్ర‌భృతుల స‌మ‌క్షంలో వి-ఎఫ్ఎన్‌సీసీ అత్యంత వైభ‌వంగా నేడు ప్రారంభ‌మైంది.

  •  
  •  
  •  
  •  

Comments