ఈ వైజాగ్ కి ఏమైంది.. పట్టపగలు అత్యాచారం జరుగుతుంటే..!

Monday, October 23rd, 2017, 07:09:44 PM IST

విశాఖ నగర ప్రజలకు ఇది తలవంపులు తెచ్చే ఘటన. కళ్ళముందు ఘోరమైన నేరం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఓ అభాగ్యురాలిపై అగంతకుడొకడు నడిరోడ్డుపై అత్యాచారం చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మతిస్థిమితం లేని మహిళ(43) పై ఈ అఘాయిత్యానికి పాల్పడడం విస్మయానికి గురిచేసే అంశం. ఈ ఘటన జరిగింది కూడా నిర్మానుష్య ప్రాంతంలో కాదు. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో. విశాఖపట్నంలోని తాటిచెట్ల పాలెం నుంచి రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి యత్నించాడు. అక్కడున్న వారంతా తమకేం పట్టనట్లు ఉండడం విశేషం.

మధ్యాహ్నం 2:30 గంటలకు ఆ మార్గంలో వాహనాలు వస్తూ వెళుతూనే ఉన్నాయి. ఆ మార్గంలో వెళుతున్న మహిళని శివ (23) అనే యువకుడు వెంబడించాడు. కొంత దూరం వెళ్ళాక ఆ మహిళ చెట్టువద్ద కూర్చుంది. అందరూ చూస్తుండగానే శివ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అటువైపుగా ఆటోలో వెళ్తున్న ఓ వ్యక్తి దీనిని మొబైల్ లో వీడియో తీసాడు. లైంగిక దాడికి పాల్పడిన అనంతరం అతడు బైక్ పై పారిపోయాడు. ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీస్ లు కేసు నమోదుచేసుకున్నారు. రైల్వే న్యూ కాలనీ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువకుడిపై అత్యాచారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సీఐ జివి రమణ తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments