ట్రిపుల్ ఎక్స్‌4 లేదా పెళ్లి? ఏదో ఒక‌టి!

Friday, June 1st, 2018, 05:14:16 PM IST

గ‌త కొంత‌కాలంగా అందాల దీపిక ప‌దుకొన్ సినిమాల‌కు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ భామ పెళ్లి స‌న్నాహ‌కాల్లో ఉంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ప‌ద్మావ‌త్ వంటి సంచ‌ల‌న చిత్రంలో న‌టించిన దీపిక కెరీర్‌కి ప్ర‌స్తుతం కామా పెట్టే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అభిమానుల్లో ముచ్చ‌ట సాగుతోంది. అయితే దీపిక ప‌దుకొనేకు ఆఫ‌ర్ల వెల్లువ మాత్రం అలానే ఉంది. ఈ అమ్మ‌డు ఓకే చెప్పాలే కానీ, అవ‌కాశాలకు కొదవేం లేదు.

కేవ‌లం బాలీవుడ్‌లో మాత్ర‌మే కాదు, అటు హాలీవుడ్ నుంచి క్రేజీగా ఛాన్సులొస్తున్నాయి. దీపిక ఇదివ‌ర‌కూ హాలీవుడ్ యాక్ష‌న్ హీరో విన్ డీసెల్ స‌ర‌స‌న ట్రిపుల్ ఎక్స్ 3 చిత్రంలో న‌టించింది. ఈ సిరీస్‌లో ప్ర‌స్తుతం నాలుగో భాగం తెర‌కెక్కించేందుకు ద‌ర్శ‌కుడు డిజె కార్సో రెడీ అవుతున్నాడు. ఆ క్ర‌మంలోనే అత‌డు ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశాడు. ట్రిపుల్ ఎక్స్ 4 చిత్రాన్ని ఓ బాలీవుడ్ డ్యాన్స్ సాంగ్‌తో ముగిస్తాను.. దీపిక ప‌దుకొనే లుంగీ డ్యాన్స్‌తోనే ముగింపు ఉండొచ్చ‌ని భావిస్తున్నా“ అని అన్నాడు. దీనిని బ‌ట్టి దీపిక ప‌దుకొనే లేకుండా ఈ సినిమా సెట్స్‌కెళ్ల‌ద‌ని అత‌డు హింటిచ్చిన‌ట్ట‌య్యింది. పార్ట్ 3లో పాత్ర‌కు కొన‌సాగింపు పాత్ర‌లో దీపిక న‌టించేందుకు అంగీక‌రిస్తుందా? లేదూ పెళ్లి షాక్‌తో ట్రిపుల్ ఎక్స్ టీమ్‌కి షాకిస్తుందా? అన్న‌ది వేచి చూడాలి.