జగన్ పాలనలో ఏపీ అభివృద్ది పూర్తిగా రివర్స్‌ కాబోతుంది – యనమల రామకృష్ణుడు

Saturday, May 15th, 2021, 10:12:59 AM IST


ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కోవిడ్ రెండు దశల్లో చేసిన ఖర్చు, ఆదాయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తొలిదశలో ఏపీ ఆర్థిక వృద్దిరేటు 4.3%కు పడిపోయిందని, 2021-22 వృద్దిరేటు ఇప్పటికే 0.3%కు పతనమైందని అన్నారు. కరోనా కన్నా జగన్ బాధ్యతారాహిత్యమే ఏపీకి కీడు చేస్తుందని తయారీ రంగంపై పూర్తి నిర్లక్ష్యం, పారిశ్రామిక పెట్టుబడులు రాబట్టడంపై అశ్రద్ద వహించారని యనమల ఆరోపించారు.

అయితే ద్రవ్యలోటు, ఆదాయలోటు, అధిక అప్పులే జగన్ సాధించిన ఘనత అని, ఈ ఆర్థిక సంక్షోభం దుష్ఫలితాలతో మరో మూడేళ్లు రాష్ట్రం అతలాకుతలం అవుతుందని, ఏపీని ఇంతలా కోలుకోలేని స్థితికి దిగజార్చిన ఘనత జగన్‌దే అని యనమల చెప్పుకొచ్చారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీ అభివృద్ది పూర్తిగా రివర్స్‌గా మారబోతుందని, అభివృద్దిలో, పేదల సంక్షేమంలో, ఉపాధిలో అంతా రివర్స్‌గా చేశారని, నిరుద్యోగ రేటు కూడా ఇప్పటికే 10%కు చేరిందని, భవిష్యత్‌లో ఇది 20%కు దిగజారడం తథ్యమని యనమల అన్నారు. రివర్స్ రూలర్‌గా జగన్ రెడ్డి పేరు రికార్డుల్లో నిలిచిపోతుందని అన్నారు.