ఓట్లు దండుకొనేందుకే హోదా అంశాన్ని వాడుకున్నారు – యనమల

Friday, June 11th, 2021, 03:09:15 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన పై తెలుగు దేశం పార్టీ నేతలు వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ మేరకు తెలుగు దేశం పార్టీ కీలక నేత యనమల రామకృష్ణుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెయిల్ రద్దు భయంతో కేసుల మాఫీ కోసం కేంద్ర పెద్దల ముందు సాష్టాంగ పడేందుకే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే పర్యటనకు సంబందించిన వివరాలు వెల్లడించకుండా ఉండటంతో లోపాయికారీ ఒప్పందం అని తెలిసిపోతుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాం అని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు మూగనోము పాటిస్తూ ప్రజల గొంతు కోసేసారు అంటూ విమర్శించారు.

అయితే హోదా వస్తే ఒంగోల్ కూడా హైదరాబాద్ లా తయారు అవుతుంది అని, పెట్టుబడులు ఉద్యోగాలు వస్తాయి అని యువతకి చెప్పిన జగన్, నేడు కేంద్రాన్ని ఎందుకు అడగలేక పోతున్నారో సమాధానం చెప్పాలి అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ప్రజల్ని మోసగించి ఓట్లు దండు కోవడానికే హోదా అంశాన్ని వాడుకున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అభివృద్ది కి ఉపయోగ పడని మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.