రోజా ప‌ద‌వికి లైన్ క్లియ‌ర్..బాధ్య‌త‌లు స్వీక‌రిస్తుందా?

Thursday, July 11th, 2019, 12:50:28 PM IST

వైసీపీ పార్టీకున్నఏకైక ఫైర్ బ్రాండ్ నేత రోజా. న‌గ‌రి రాజ‌కీయాల్లో చురుకుగా వుంటూ వ‌స్తున్న రోజా వైసీపీ పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు. ఈ ద‌ఫా ఆమెకు మంత్రి ప‌ద‌వి ఖాయం అంటూ ఎన్నిక‌ల స‌మ‌యం నుంచే ప్రచారం జోరుగా సాగింది. అయితే సీఎం వైఎస్ జ‌గ‌న్ అనూహ్యంగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో రోజాని ప‌క్క‌న పెట్టి కొత్త ముఖాల‌కు అవ‌కాశం ఇవ్వ‌డంతో అంతా షాక‌య్యారు. ఏంటీ రోజానే ప‌క్క‌న పెట్టారు? వైఎస్ జ‌గ‌న్ ఎందుకుకిలా చేశారని స‌ర్వ‌త్రా చ‌ర్చ‌జ‌రిగింది. మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశ‌గా ఎదురుచూసిన రోజా మ‌న‌స్థాపానికి గుర‌య్యారు కూడా. అయితే జ‌ర‌గ‌బోయే న‌ష్టాన్ని వారించ‌డానికి రంగంలోకి దిగిన విజ‌య‌సాయిరెడ్డి రోజాను బుజ్జ‌గించారు.

ఆ త‌రువాత కొన్ని రొజుల‌కి రోజాకు ఏపీఐఐసీసీ చైర్మ‌న్ ప‌ద‌విని ప్ర‌క‌టించారు. అయితే ఇంత వ‌ర‌కు ఆ ప‌ద‌విని రోజా చేప‌ట్ట‌లేదు. ప్ర‌భుత్వం కూడా అధికారికంగా ఆమెకు ప‌ద‌విని క‌ట్ట‌బెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌లేదు. దీంతో రోజా కూడా సైలెంట్ అయిపోయి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్నారు. ఏకంగా అమ‌రావ‌తి రావ‌డ‌మే మానేశార‌ట‌. సొంత నియోజ‌క వ‌ర్గం న‌గ‌రికి కూడా గ‌త కొంత కాలంగా రోజా దూరంగా వుంటూ వ‌స్తున్నారు. అయితే తాజాగా ఆమెకు ఏపీఐఐసీసీ చైర్మ‌న్ బాధ్య‌త‌ల్ని అధికారికంగా అప్ప‌గిస్తూ ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌ట‌న‌ని విడుద‌ల చేసింది. దీంతో రోజా ఆ ప‌ద‌విని స్వీక‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంద‌ని చెబుతున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల ప్ర‌క‌టించిన వెంట‌నే ఏపీఐఐసీసీ చైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌లేకపోయార‌ని, ఆ కార‌ణంగానే అధికారికంగా ఉత్త‌ర్వులు ఇవ్వ‌లేద‌ని, ఇటీవ‌లే అన్ని అడ్డంకులు తొల‌గిపోవ‌డంతో రోజాకు ఆ ప‌ద‌విని కేటాయించారని వినిపిస్తోంది. మ‌రి ఇప్ప‌టికైనా రోజా ఆ ప‌ద‌విని స్వీక‌రిస్తుందా? లేక ఎప్ప‌టిలాగే తిర‌స్క‌రిస్తుందో చూడాలి.