రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్ళం కాదు మేము – వైసీపీ నేత

Friday, June 14th, 2019, 02:30:46 AM IST

ఏపీలో కొత్త ప్రభుత్వం అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే. కాగా ఈసారి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి టీడీపీ సభ్యులు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే వీరి వాదన ఈసారి చాలా ఎక్కువగా ఉండనుందని రాజకీయ శ్రేణులు చెబుతున్నారు. కాగా ఈ సమావేశాల్లో టీడీపీ సభ్యులు ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనం పాటిస్తామని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఒకవేళ టీడీపీ సభ్యులు గనక మరీ శృతి మించి మాట్లాడితే గనక సభ నియమాల ప్రకారం స్పీకర్ తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ‘టీవీ 9’ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… 2019లో ప్రజలు నమ్మకంతో తమకు ఓటు వేశారని, 2024లో తమ పనితీరు చూసి ప్రజలు ఓటేయాలని, అధికారం చేతికొచ్చిందని ఎవరూ అహంకార పడొద్దని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, నిత్యం ప్రజల్లో ఉండాలని, ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించాలని, అవినీతి లేని సమాజాన్ని అందించాలని తమ అధినేత జగన్ తమకు పదేపదే చెబుతుంటారని అన్నారు. మా అందరికి అండగా ఉన్నటువంటి జగన్ మాటని జవదాటమని, ఆయనకు తలఒంపులు తెచ్చే పనులు ఎం చేయమని చెప్పారు. ఈ సమావేశాల్లో అన్ని అర్థవంతమైన చర్యలు చేస్తామని, అందరికి ఉపయోగపడేలాగే చర్యలు తీసుకుంటామని చెప్పారు.